బరువును తగ్గించే పనీర్.. ఎలాగో తెలుసా!

  • పనీర్ లో ఎక్కువ ప్రొటీన్లు 
  • తిన్నాక ఎక్కువ సేపు కడుపు నిండుగా
  • ఒక కప్పు పనీర్ తో 28 గ్రాముల ప్రొటీన్
  • దీనిలోని లినోలిక్ యాసిడ్ కు కొవ్వును కరిగించే గుణం
Paneer Can Reduce Your Weight

పాలక్ పనీర్, పనీర్ బిర్యానీ, పనీర్ పులావ్, పనీర్ టిక్కా.. అబ్బా, పేర్లు వింటనే నోరూరేస్తోంది కదా! ఇంకెందుకాలస్యం.. లాగించేసెయ్యండి. వామ్మో.. ఇంకేమైనా ఉందా.. తింటే లావైపోతేనూ.. అని అనుకుంటున్నారా! అస్సలు ఆ సమస్యే ఉండదటండోయ్. ఇంకా చెప్పాలంటే బరువు తగ్గుతారట. ఇది నిజంగా నిజమంటున్నారు నిపుణులు. అదెలాగో చదివేయండి మరి...

ప్రొటీన్ ఎక్కువ

పనీర్ ను పాల నుంచి తయారు చేస్తారన్న సంగతి తెలిసిందే. కాబట్టి అందులో మిల్క్ ప్రొటీన్లు (పాలల్లోని మాంసకృత్తులు) పుష్కలంగా ఉంటాయి. హెల్త్ జర్నల్ ప్రకారం ఒక కప్పు పనీర్ లో 28 గ్రాముల ప్రొటీన్, 163 కేలరీల ఎనర్జీ ఉంటుంది. 

ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు త్వరగా జీర్ణం కావు. అవి జీర్ణమవ్వడానికి చాలా టైం పడుతుంది. కడుపు నిండుగా అనిపిస్తుంది. కాబట్టి తిండికి కొంచెం దూరంగా ఉండేట్టు చేస్తుంది. కాబట్టి ఓ రకంగా బరువు తగ్గేందుకు అది దోహదం చేస్తున్నట్టే. 

కేలరీలు తక్కువే

100 గ్రాముల పనీర్ తింటే మనకు వచ్చేది కేవలం 72 కేలరీల శక్తి. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే అది చాలా తక్కువే. పనీర్ ను వేరే ఏవీ లేకుండా వట్టిగానే తినేయొచ్చు కాబట్టి బరువును తగ్గించుకోవచ్చు. బరువును నియంత్రణలో ఉంచుకోవాలంటే పనీర్ ను బేక్ చేసిగానీ.. గ్రిల్ చేసిగానీ తింటే మంచి ఫలితాలుంటాయి. 

కాల్షియం ఎక్కువ

పనీర్ తో ఇంకో లాభమేంటంటే.. రోజువారీ కాల్షియం అవసరాల్లో 30 శాతం పనీర్ తీర్చేస్తుంది. ఎముకల పటుత్వం నుంచి మొత్తం శారీరక ఆరోగ్యం దాకా ఆ కాల్షియం ఎంత ముఖ్యమైనదో తెలిసిందే. 30 ఏళ్లు దాటిన మహిళలకు కాల్షియం చాలా ముఖ్యం. కాబట్టి.. ఇంట్లో ఎప్పుడైనా పనీర్ వంటకాలను తినేటప్పుడు.. మహిళలు కొంచెం ఎక్కువగా తీసుకోవడం బెటర్. ఎందుకంటే అందరికన్నా వారికే దాని అవసరం ఎక్కువ మరి. 

లినోలిక్ యాసిడ్

బరువు తగ్గడంలో కీలకంగా ఉండే కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్.. పనీర్ లో పుష్కలంగా ఉంటుంది. వాస్తవానికి మాంసం, పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా ఇది లభిస్తుంది. మొక్కలు, ఆకులు ఎక్కువగా తినే జంతువుల మాంసంలోనే ఎక్కువగా దొరుకుతుంది. ఒంట్లో కొవ్వు పేరుకుపోకుండా, రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా లినోలిక్ యాసిడ్ చూసుకుంటుంది. కాబట్టి అది ఉన్న పనీర్ ను ఆహారంలో భాగం చేసుకుంటే బరువును తగ్గించుకోవచ్చు. 

ఈ తప్పు చేయొద్దు

పనీర్ తో లాభాలు ఎక్కువగా ఉన్న మాట నిజమే అయినా.. దానిని ఎలా వండుకుని తింటున్నాం? అన్న దానిపైనా దాని వల్ల కలిగే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అవును, ఫ్యాట్ ఎక్కువగా ఉండే బటర్ తో చేసే పనీర్ బటర్ మసాలా కన్నా.. సింపుల్ గా ఉండే పాలక్ పనీర్ గానీ, పనీర్ టిక్కాగానీ తింటే మనకు లాభాలు కలుగుతాయి. పనీర్ ను దేనితో కలిపి తింటున్నామనే దానిపైనా బరువు తగ్గే విషయం ఆధారపడి ఉంటుంది. 

ప్రొటీన్ ఉండే మరిన్ని శాకాహార పదార్థాలు

ఒక్క పనీరే కాదు.. మరిన్ని శాకాహార పదార్థాల్లోనూ ప్రొటీన్ ఉంటుంది. పనీర్ వద్దు అనుకుంటే టోఫులోనూ అధికంగా ప్రొటీన్లుంటాయి. దాంట్లోని ఐసోఫ్లేవన్లు ఆస్టియోపోరోసిస్, కేన్సర్, గుండె జబ్బులను చాలా వరకు తగ్గిస్తాయి. 

లెంటిల్స్ లోనూ ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు లెంటిల్స్ తో 18 గ్రాముల ప్రొటీన్ అందుతుంది. వాటిలోనే ఫైబర్ తో మన కడుపు ఆరోగ్యం బాగుంటుంది. 

కప్పు బీన్ల నుంచి 15 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. దాంతో పాటు కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఐరన్, ఫోలేట్, ఫాస్ఫరస్, పొటాషియమ్ లూ అధికంగా ఉంటాయి. ఒంట్లోని కొవ్వు, చక్కెర స్థాయులను నియంత్రిస్తూ పొట్ట కొవ్వునూ తగ్గిస్తాయి బీన్లు. 

బాదంపప్పులు, వేరు శనగ, సోయా పాలు, బఠాణీలు, క్వినోవా, చియా సీడ్స్ లోనూ ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలన్నా.. మన ఆరోగ్యాన్ని దృఢంగా మార్చుకోవాలన్నా వెంటనే వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

More Telugu News