balaiah: ప్ర‌ముఖ సీనియర్ న‌టుడు బాల‌య్య క‌న్నుమూత‌!

  • హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన నివాసంలో తుదిశ్వాస‌
  • ద‌ర్శ‌కుడిగా, నిర్మాతగా, కథా రచయితగానూ రాణించిన బాల‌య్య‌
  • పుట్టినరోజు నాడే కన్నుమూత
balaiah passes away

ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య(94) హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన నివాసంలో కన్నుమూశారు. అనారోగ్య కార‌ణాల‌తో ఆయ‌న తుది శ్వాస విడిచార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు వివ‌రించారు. బాల‌య్య‌ నటుడిగానే కాకుండా ద‌ర్శ‌కుడిగా, నిర్మాతగా, కథా రచయితగానూ రాణించారు.  పుట్టినరోజు నాడే ఆయ‌న కన్నుమూశారు. 

కాగా, మద్రాసు గిండీ కాలేజీలో చదువుకునే రోజుల్లో బాల‌య్య‌ నాటకాల్లో నటించారు. మెకానికల్ ఇంజినీరింగులో బాల‌య్య 1952లో బీఈ పూర్తి చేశారు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్‌గా పనిచేశారు.  

నటుడిగా బాల‌య్య‌ 300కిపైగా సినిమాల్లో నటించారు. ఆయ‌న 1958లో వ‌చ్చిన‌ 'ఎత్తుకు పైఎత్తు' సినిమాతో న‌టుడిగా సినీ రంగంలో అడుగుపెట్టారు. 2011లో 'శ్రీరామరాజ్యం' సినిమాలోనూ వశిష్ఠుడి పాత్ర‌లో న‌టించారు. 2012లో 'నందీశ్వరుడు', 'దేవరాయ' సినిమాలలో న‌టించారు. 

ఆ తర్వాత నుంచి న‌ట‌నకు దూరంగా ఉంటున్నారు. ఆయ‌న నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా ప‌లు సినిమాలు నిర్మించారు. శోభన్ బాబు హీరోగా 'చెల్లెలి కాపురం', కృష్ణ హీరోగా 'నేరము-శిక్ష', 'చుట్టాలున్నారు జాగ్రత్త', చిరంజీవి హీరోగా 'ఊరికిచ్చిన మాట' వంటి సినిమాల‌ను నిర్మించారు.

అంతేగాక‌, దర్శకుడిగా 'పసుపు తాడు', 'పోలీసు అల్లుడు' వంటి సినిమాల‌ను రూపొందించారు. ఊరికిచ్చిన మాట సినిమాకు ఆయ‌న‌కు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు ద‌క్కింది. అలాగే, ఉత్త‌మ నిర్మాత‌గా చెల్లెలి కాపురం సినిమాకూ నిర్మాతగా నంది అవార్డు వ‌రించింది. ప‌లు టీవీ సీరియల్స్ లోనూ బాల‌య్య‌ నటించి పలు అవార్డులు అందుకున్నారు.

మ‌రోవైపు, బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా ప‌లు సినిమాల్లో హీరోగా నటించారు. బాల‌య్య మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

More Telugu News