Cricket: జెండాలు హింసకు ఆయుధాలు.. స్టేడియాల్లోకి జెండాలు తీసుకురాకుండా బీసీసీఐ, పోలీసుల నిషేధం

  • జెండా కర్రలతో ప్రేక్షకులు, ఆటగాళ్లకు ప్రమాదం
  • మైదానంలోకి విసిరేసే ముప్పుందని వెల్లడి
  • అందుకే నిషేధిస్తున్నామంటూ వివరణ  
  • జెండాలు బయటపడేశాకే స్టేడియం లోపలికి అనుమతి
Flags Can Be Weapon Of Violence Says BCCI and Mumbai Police

మ్యాచ్ అన్నాక అభిమానులు తాము అభిమానించే జట్ల జెండాలు పట్టుకుని రావడం కామన్. తమ అభిమాన జట్టు బ్యాటర్ బౌండరీ బాదినా, బౌలర్ వికెట్ తీసినా ఆనందంతో జెండాలను రెపరెపలాడిస్తుంటారు. అయితే, ఆ జెండాలే హింసకు ఆయుధాలని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ), ముంబై పోలీసులు అంటున్నారు. అవును, అక్షరాలా ఇది వాళ్లు చెబుతున్న మాటే. 

ఈ ఐపీఎల్ సీజన్ లో అభిమానులు జెండాలు తీసుకుని స్టేడియంలోకి రాకుండా ఆంక్షలు పెడుతున్నారు. ఎందుకని అడిగితే.. ఆ జెండాలకు పెట్టిన కర్రలతో స్టేడియంలోని వారిపై దాడి చేసేందుకు ఆస్కారం ఉంటుందని, మైదానంలోకి వాటిని విసిరే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. దాని వల్ల ప్రేక్షకులకుగానీ లేదా ఆటగాళ్లకుగానీ గాయాలవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అందుకే ముందుజాగ్రత్త చర్యగా జెండాలను లోపలికి అనుమతించట్లేదని అంటున్నారు. వాస్తవానికి మహమ్మారికి ముందు మామూలు పరిస్థితులే ఉండడంతో జట్టు యాజమాన్యాలే ప్లాస్టిక్ జెండాలను అరెంజ్ చేసేవని, కానీ, ఇప్పుడు ఇండియన్ బోర్డు నేరుగా మ్యాచ్ లను నిర్వహిస్తుండడం, కర్ర జెండాలను బయటి నుంచి తీసుకువస్తుండడంతోనే జెండాలపై నిషేధం విధించారని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి చెప్పారు. 

బీసీసీఐ, ముంబై పోలీసుల నిర్ణయంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. విరాట్ కోహ్లీకి పెద్ద అభిమాని అయిన చిరాగ్ ఖిలారే అనే వ్యక్తిని పోలీసులు స్టేడియం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. జెండాను బయట పడేశాకగానీ లోపలికి పంపలేదు. దీంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

తాను భారీ జెండాను తీసుకొచ్చానని, దానికి ప్లాస్టిక్ సపోర్ట్ ఇవ్వలేదని చెప్పారు. అందుకే సచిన్ కు పెద్ద అభిమాని అయిన సుధీర్ నుంచి పెద్ద స్టీల్ రాడ్ తీసుకుని జెండాకు పెట్టానని వివరించారు. సుధీర్ అంటే ఫేమస్ కాబట్టి లోపలికి అనుమతిస్తున్నారని, మరి, తమలాంటి వాళ్ల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి బీసీసీఐ దీనిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News