rbi: వృద్ధి, ద్రవ్యోల్బణంపై షాకిచ్చిన ఆర్బీఐ.. రెపో, రివర్స్ రెపోలో మార్పు లేదు

  • రెపో రేటు 4 శాతం వద్దే కొనసాగింపు
  • రివర్స్ రెపో 3.35 శాతమే
  • వ్యవస్థలో అదనపు లిక్విడిటీ దశలవారీగా తగ్గింపు
  • ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉండొచ్చు
  • 2022-23లో వృద్ధి రేటు అంచనా 7.2 శాతానికి తగ్గింపు
  • ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాల వెల్లడి
RBI sticks to status quo

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని ఆర్బీఐ గుర్తించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధిస్తుందని లోగడ వేసిన అంచనాలను దిగువకు సవరించింది. వృద్ధి రేటు 7.2 శాతంగానే ఉండొచ్చంటూ తాజా అంచనాలు ప్రకటించింది.  

అలాగే ధరల పెరుగుదల ఒత్తిళ్లు కొనసాగుతాయని పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఇది గత అంచనా 4.5 శాతమే. మూడు రోజుల పాటు కొనసాగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ తన నిర్ణయాలను శుక్రవారం ఉదయం ప్రకటించింది. పాలసీ వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు.

ఆర్థిక రంగానికి మద్దతుగా అవసరమైతే రేట్లను మరింత తగ్గించేందుకు సర్దుబాటు విధానాన్ని (అకామడేటివ్ స్టాన్స్) ఆర్బీఐ గత రెండేళ్లకు పైగా కొనసాగిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో దీన్ని లెస్ అకామడేటివ్ గా మార్చుకుంది. తదుపరి రేట్ల పెంపు దిశగా అడుగులు వేయనున్నట్టు దీని ద్వారా ఆర్బీఐ సంకేతం ఇచ్చింది. 

మరిన్ని పాలసీ వివరాలు

  • కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ లతో వ్యవస్థలోకి అదనంగా విడుదల చేసిన లిక్విడిటీని వెనక్కి తీసుకోనుంది. రూ.8.5 లక్షల కోట్ల మిగులు లిక్విడిటీని దశలవారీగా తగ్గించనుంది.
  • ప్రైవేటు వినియోగం, దేశీయ డిమాండ్ నిశ్చలంగా, స్తబ్దుగా ఉన్నాయి.
  • వృద్ధి రేటు క్షీణించే, ద్రవ్యోల్బణం పెరిగే రిస్క్ లు ఉన్నాయి.
  • రెపో రేటును 4 శాతం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. రెండేళ్లుగా ఇదే రేటు కొనసాగుతోంది.
  • రివర్స్ రెపో రేటు సైతం 3.35 శాతంగానే కొనసాగనుంది.
  • సర్దుబాటు వైఖరిని అనుసరిస్తూనే.. ద్రవ్యోల్బణం కట్టడికి దీన్ని ఉపసంహరించుకోవడంపై దృష్టి సారించనుంది. 
  • కరోనా లాక్ డౌన్ ల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. అయితే ఒమిక్రాన్ వేవ్ సమసిపోవడం వల్ల పొందే లాభాలను భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అందకుండా చేస్తున్నాయని ఆర్బీఐ అభిప్రాయపడింది. 
  • 2022-23 మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6.3 శాతం, క్యూ2లో 5 శాతం, క్యూ3లో 5.4 శాతం, క్యూ4లో 5.1 శాతం చొప్పున ఉండొచ్చు. మొత్తం సంవత్సరానికి సగటున 5.7 శాతం ఉంటుంది.

More Telugu News