నట్టి కుమార్ ఆరోపణలపై రామ్‌గోపాల్ వర్మ స్పందన.. సినిమా విడుదల వాయిదాకు వేరే కారణం ఉందన్న ఆర్జీవీ

  • నట్టి కుమార్‌కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న వర్మ
  • ఆయన ఎప్పుడూ ఎవరో ఒకరిపై విమర్శలు చేస్తూనే ఉంటారన్న ఆర్జీవీ
  • ఇకపై ఎక్కడా ఆయన గురించి మాట్లాడబోనన్న దర్శకుడు
RGV Responds on Producer Natti Kumar Allegations

నిర్మాత నట్టికుమార్ తనపై చేసిన ఆరోపణలపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. నట్టి కుమార్ నోటీసులకు తన అడ్వకేట్ సమాధానమిస్తారని చెప్పారు. తనపై వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలకు సమాధానం ఎలా చెప్పాలో తనకు తెలుసని అన్నారు. ఇండస్ట్రీలో ఎవరిమీదో ఒకరి మీద ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటేనని, గతంలో చిరంజీవి, సురేశ్‌బాబు మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని అన్నారు. ఆయనేంటో ఇండస్ట్రీలో అందరికీ తెలుసని అన్నారు. 

తన కొడుకు, కుమార్తెతో తీసిన సినిమాకు పెద్దగా ప్రమోషన్‌ చేయలేదని, రావల్సిన కమీషన్‌ రాలేదని కొందరిని ఆయన దూషించాడని వర్మ అన్నారు. ఇక తన సినిమా ‘మా ఇష్టం’ విడుదల వాయిదాకు నట్టికుమార్ కారణం కాదని, వేరే కారణం ఉందన్నారు. లెస్బియన్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాను ప్రదర్శించేందుకు చాలా థియేటర్లు ముందుకు రావడం లేదని, దీనిపై లీగల్‌గా ఫైట్ చేసేందుకే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. 

నట్టి కుమార్‌కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కాబట్టి ఆయన గురించి ఇకపై ఎక్కడా మాట్లాడనని పేర్కొన్నారు. చట్ట పరంగా ఎలా ముందుకెళ్లాలనే విషయాన్ని తన అడ్వకేట్ చూసుకుంటారని ఆర్జీవీ వివరించారు. 

కాగా, వర్మ గత చిత్రాలకు తన స్నేహితులతో కలిసి తాను ఫైనాన్స్ చేశానని, అందుకు సంబంధించి తనకు ఇంకా రూ. 5.29 కోట్లు రావాల్సి ఉండగా, ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడని నట్టి కుమార్ కోర్టును ఆశ్రయించారు. ప్రతి సినిమాకు రూ. 50 లక్షలు ఇవ్వాలనే ఒప్పందం తమ మధ్య ఉందని, కానీ ఆయన దానిని ఉల్లంఘించారని నట్టి కుమార్ ఆరోపించారు. పిటిషన్‌ను విచారించిన సిటీ సివిల్ కోర్టు  'డేంజరస్ (మా ఇష్టం)' విడుదలను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేడు విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.

More Telugu News