ఆ ఐదారుగురు ఎవరు?... ఏపీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్
- ఐదారుగురికి ఛాన్సే దక్కొచ్చన్న కొడాలి నాని
- వారెవరన్నది తనకు తెలియదని వ్యాఖ్య
- కొత్త కేబినెట్‌లోకి పాత మంత్రులెవరన్న దానిపై చర్చ
ఈ క్రమంలో కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన మంత్రి కొడాలి నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన వారిలో ఓ ఐదుగురో, ఆరుగురో తిరిగి కొత్త మంత్రివర్గంలో పనిచేసే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. పనితీరులో సత్తా కనబరచిన వారో, అనుభవమున్న సీనియర్లో, లేదంటే సామాజిక వర్గ సమీకరణాలో తెలియదు గానీ... ఇప్పుడు రాజీనామాలు చేసిన వారిలో ఓ ఐదారుగురు మంత్రులకు కొత్త కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలున్నట్లు ఆయన చెప్పారు.
కొడాలి నాని వ్యాఖ్యలతో ఏపీలో ఒక్కసారిగా ఓ పెద్ద చర్చకు తెర లేచింది. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కే ఐదారుగురు పాత మంత్రులు ఎవరంటూ ఎవరికి తోచిన లెక్కలతో వారు అంచనాలేస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక వర్గ సమీకరణాలను ప్రధానంగా ముందేసుకుని మరీ కొందరు లోతైన చర్చల్లోకి మునిగిపోయారు. అయితే ఆ ఐదారుగురు ఎవరన్న విషయం మాత్రం జగన్ ప్రకటించే దాకా ఏ ఒక్కరికీ తెలియదనే చెప్పాలి. ఈ తరహా వ్యవహారాల్లో చాలా సీక్రెసీని మెయింటైన్ చేస్తున్న జగన్.. చివరి నిమిషం దాకా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.