Sanath Jayasuriya: భారత ప్రభుత్వం, మోదీకి ఎప్పటికీ రుణపడి ఉంటాం: శ్రీలంక క్రికెట్ దిగ్గజం జయసూర్య

Grateful To India For Help says Jayasuriya
  • తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక
  • లంకకు తనవంతు సహాయ, సహకారాలను అందిస్తున్న భారత్
  • భారత్ పెద్దన్నయ్య పాత్రను పోషిస్తోందన్న జయసూర్య
భారత్ ను పెద్దన్నయ్యగా సంబోధిస్తూ శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం జయసూర్య ప్రశంసలు కురిపించారు. ఆర్థిక, ఆహార, చమురు సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో దుర్భర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంత దారుణ పరిస్థితులు లేవు. సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్ తనవంతు సాయాన్ని అందిస్తోంది. 

ఈ నేపథ్యంలో జయసూర్య మాట్లాడుతూ, పొరుగుదేశమైన భారత్ పెద్దన్నయ్య పాత్రను పోషిస్తూ శ్రీలంకను ఎప్పుడూ ఆదుకుంటూనే ఉందని కొనియాడారు. భారత ప్రభుత్వం, ప్రధాని మోదీలకు రుణపడి ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న దారుణ పరిణామాల నేపథ్యంలో శ్రీలంక మనుగడ సాగించడం అంత సులభం కాదని... భారత్, ఇతర దేశాల సాయంతో సంక్షోభం నుంచి గట్టెక్కగలమని భావిస్తున్నట్టు తెలిపారు. 

చమురు లేకపోవడం వల్ల ఆ దేశంలో విద్యుత్ ఉత్పత్తి దారుణ స్థాయికి పడిపోయింది. ప్రతిరోజు 13 గంటలకు పైగా విద్యుత్ కోతలను విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంకకు భారత ప్రభుత్వం ఇప్పటి వరకు 2,70,000 మెట్రిక్ టన్నుల ఫ్యూయల్ ను పంపించింది. 

మరోవైపు కొలంబోలోని ఇండియన్ ఎంబసీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... గత 24 గంటల్లో ఇండియా నుంచి శ్రీలంకకు 36 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్, 4 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ వచ్చిందని చెప్పింది. దీంతో ఇప్పటి వరకు 2,70,000 మెట్రిక్ టన్నుల చమురు వచ్చినట్టయిందని తెలిపింది.
Sanath Jayasuriya
Sri Lanka
India

More Telugu News