XE variant: అది కరోనా కొత్త వేరియంట్ 'ఎక్స్ఈ' అంటున్న మహారాష్ట్ర.. కాదంటున్న కేంద్రం!

  • ఎక్స్ఈ వేరియంట్ గా మహారాష్ట్ర సర్కారు ప్రకటన
  • తొందరపడి ప్రకటించారన్న కేంద్రం
  • జీనోమిక్ పిక్చర్ తో పోలడం లేదు
  • కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి వాదన
  • మరో విడత జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయాలని నిర్ణయం
XE variant or not Maharashtra reports first case Centre disagrees

కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ఈ విషయంలో మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం భిన్న వైఖరి తీసుకున్నాయి. బ్రిటన్ లో మూడు నెలల క్రితం (జనవరిలో) వెలుగు చూసిన ఎక్స్ఈ వేరియంట్ దేశంలోనే తొలి కేసు ముంబైలో వెలుగు చూసిందంటూ బుధవారం మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విభేదించింది. 

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో మనదేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద ఎత్తున నమోదవడం తెలిసిందే. రెండు నెలల్లోనే వీటి కేసులు గణనీయంగా పెరిగి తగ్గిపోయాయి. ఒమిక్రాన్ లోనే బీఏ1, బీఏ2 రకాలు మన దగ్గర నమోదయ్యాయి. వీటి రెండింటి కలయికతో కూడిందే ఎక్స్ఈ వేరియంట్. ఇప్పటి వరకు కరోనా మ్యుటేషన్లు అన్నింటిలోకి ఎక్స్ఈకి వ్యాపించే గుణం ఎక్కువ. ఒమిక్రాన్ వేరియంట్ తో పోలిస్తే 10 శాతం ఎక్కువ వేగంతో విస్తరించగలదని గుర్తించారు. బ్రిటన్ లో ప్రస్తుతం ఈ కేసులు నమోదవుతున్నాయి. 

50 ఏళ్ల దక్షిణాఫ్రికా మహిళ ఫిబ్రవరి 10న ముంబైకి వచ్చింది. ఫిబ్రవరి 27న ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నమూనాను కస్తూర్బా హాస్పిటల్ సెంట్రల్ లేబరేటరీకి పంపించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ లో ఎక్స్ఈ వేరియంట్ గా గుర్తించినట్టు మహారాష్ట్ర స్టేట్ సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ అవతే తెలిపారు. ఆమెకు లక్షణాలు కూడా లేవని చెప్పారు. గ్లోబల్ జీనోమిక్ డేటా ప్రకారం ఎక్స్ఈ వేరియంట్ గా నిర్ధారణ అయినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 

కానీ తొందరపాటుతో ఎక్స్ఈ వేరియంట్ గా ప్రకటించినట్టు కేంద్ర ప్రభుత్వం అంటోంది. ‘‘ముందు మేము కూడా ఎక్స్ఈ అనే అనుకున్నాం. ఇన్సాకాగ్ కు చెందిన జీనోమిక్ నిపుణులు ఫాస్ట్ క్యూ ఫైల్స్ ను విశ్లేషించి చూసినప్పుడు .. ఈ వేరియంట్ జీనోమిక్ కానిస్టిట్యూషన్ ఎక్స్ఈ జీనోమిక్ పిక్చర్ తో పోలడం లేదని తెలిసింది’’ అని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో మరో విడత జీనోమిక్ సీక్వెన్సింగ్ విశ్లేషణకు వీలుగా.. పశ్చిమబెంగాల్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ కు సదరు శాంపిల్ ను పంపించాలని కేంద్రం ఆదేశించింది. 

More Telugu News