పింఛను డబ్బు తీసుకుని ప్రియురాలితో కలిసి పరారైన గ్రామ వాలంటీర్!

06-04-2022 Wed 16:50
  • పల్నాడు జిల్లా మూగచింతపాలెంలో ఘటన
  • ఇప్పటికే పెళ్లై పిల్లలున్న వాలంటీర్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన అమ్మాయి తరుపు బంధువులు
Village Volunteer Elopes with girl friend with pension amount
ఏపీలో ఓ గ్రామ వాలంటీర్ చేసిన నిర్వాకం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మూగచింతపాలెంలో రవి అనే వాలంటీర్ పింఛను డబ్బులను తీసుకుని, ప్రియురాలితో కలిసి పరారయ్యాడు. ఈ విషయాన్ని గ్రామ సచివాలయ సిబ్బంది సదరు వాలంటీర్ తండ్రి దృష్టికి తీసుకొచ్చారు. 

దీంతో, పింఛనుదారులు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో వాలంటీర్ తండ్రి తన కుమారుడు తీసుకెళ్లిన మొత్తాన్ని సచివాలయ సిబ్బందికి అందించారు. అనంతరం వారు లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేశారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, గ్రామ వాలంటీర్ కు పెళ్లయి, పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఆయన ఇలా చేయడంతో, అమ్మాయి తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ రవిపై గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. పింఛన్ డబ్బులు సరిగా పంపిణీ చేయలేదని స్థానికులు చెపుతున్నారు.