Sri Lanka: శ్రీలంకలో సైనికులు, పోలీసుల మధ్య ఘర్షణ

  • కర్ఫ్యూ ఉన్నా ప్రజల నిరసన
  • పార్లమెంట్ వద్దకు తుపాకులతో బైకులపై వెళ్లిన సైనికులు
  • రిజిస్ట్రేషన్లు కూడా లేకపోవడంతో అడ్డుకున్న పోలీసులు
  • ఇరు వర్గాల మధ్య వాగ్వాదం
  • విచారణకు ఆదేశించిన ఆర్మీ చీఫ్
Police Vs Soldiers In Sri Lanka

శ్రీలంకలో పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. సంక్షోభం మరింతగా ముదురుతోంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దిగిపోవాలంటూ పౌరులు ఇప్పటికే రోడ్డెక్కారు. మిత్రపక్షాలూ ప్రభుత్వానికి హ్యాండిచ్చాయి. ప్రభుత్వంలోకి రావాలంటూ ప్రతిపక్షాలకు గొటబాయ ఆఫర్ ఇచ్చినా.. వాళ్లు నో చెప్పేశారు. తాజాగా కర్ఫ్యూలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, సైనికులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన్న పార్లమెంట్ వద్ద పౌరులు నిరసన చేపట్టారు. కర్ఫ్యూ ఉన్నా కూడా ప్రజలు పార్లమెంట్ ముందు ఆందోళన ఎలా చేశారని సైనికులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ప్రజలను అదుపు చేసేందుకు రిజిస్ట్రేషన్ లేని బైకులపై సైనికులు మాస్కులు, ఆయుధాలు పట్టుకుని వచ్చారు. 

అయితే, వారిని పోలీసులు నిలువరించారు. అక్కడికి వెళ్లడానికి వీల్లేదని సైనికులకు తేల్చి చెప్పారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారని, మారణాయుధాలతో అక్కడకు వెళ్లడమేంటని నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్యా మాటామాట పెరిగి వాగ్వివాదం చోటు చేసుకుంది. 

అయినా కూడా సైనికులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని వెంబడించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్న సమయంలో సైనికులు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయినా కూడా పోలీసులు వారి వెంట పడడంతో మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. 

దీనిపై ఆర్మీ చీఫ్ శవేంద్ర సిల్వ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇద్దరు పోలీసు అధికారులు అనైతికంగా ప్రవర్తించారని, వారిపై విచారణ చేయాలని ఐజీపీని ఆదేశించారు. మరోవైపు రక్షణ శాఖ కార్యదర్శి జనరల్ కమల్ గుణరత్నే ఈ ఘటనను ఐజీపీ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

అయితే, ప్రజలు మాత్రం పోలీసులకు మద్దతుగా మాట్లాడుతున్నారు. తుపాకులు పట్టుకుని రావడం వల్లే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. నిరసన చేస్తున్న సామాన్య ప్రజలపై సైనికులు కాల్పులు జరిపితే పరిస్థితి మరింత విషమిస్తుందన్న కారణంగానే పోలీసులు అడ్డుకున్నారని సోషల్ మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు. 

More Telugu News