కర్ణాటకలో తీరు.. ముస్లింల పట్ల అంటరానితనాన్ని అమలు చేయడమే : అసదుద్దీన్ ఒవైసీ

06-04-2022 Wed 11:56
  • పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యం లేదన్న అసదుద్దీన్ 
  • కర్ణాటకలో ముఠా పాలన నడుస్తోందని విమర్శ 
  • ముస్లిం పండ్ల వ్యాపారులను బహిష్కరించాలంటూ కర్ణాటకలో కొత్త ఉద్యమం
Enforcing untouchability against Muslims says Owaisi on call to ban Muslim monopoly in fruit business
కర్ణాటక రాష్ట్రంలో పండ్ల వ్యాపారంలో ముస్లింల ఆధిపత్యానికి చెక్ పెట్టాలంటూ అక్కడి పలు సంస్థలు ఇచ్చిన పిలుపుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు బట్టారు. రాష్ట్రంలో ముఠా పాలనను అమలు చేయడమేనంటూ విమర్శించారు. 

‘‘కర్ణాటక ప్రభుత్వం మూక పాలనను అమలు చేస్తోంది. ఎవరు ఏది విక్రయించాలి, ఎవరు ఎవరి నుంచి ఏది కొనుగోలు చేయాలన్నది ముఠాలే నిర్ణయిస్తాయి. ముస్లింల గుత్తాధిపత్యం అంటూ ఏదీ లేదు. ముస్లింల పట్ల అంటరానితనాన్ని అమలు చేయడానికి ఇదొక సాకు మాత్రమే. జన జాగృతి పేరుతో పేద ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు’’ అంటూ ఒవైసీ ట్వీట్ చేశారు.

జన జాగృతితోపాటు పలు మితవాద సంస్థలు ముస్లిం పండ్ల వ్యాపారులను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నాయి. హిందువులు మరిన్ని పండ్ల షాపులను తెరవడం ద్వారా పండ్ల వ్యాపారంలో ముస్లిం వర్తకుల ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చని హిందు జన జాగృతి సమితి పిలుపునివ్వడం గమనార్హం. 

దాదాపు పండ్ల వ్యాపారం మొత్తం ముస్లింలే చేస్తున్నారని.. హిందువులు హిందూ వ్యాపారుల నుంచే పండ్లను కొనుగోలు చేయాలని హిందూ జనజాగృతి సమితి కోర్డినేటర్ చంద్రు మోగర్ కోరారు. వారు పండ్లు, బ్రెడ్లను విక్రయించే ముందు వాటిపై ఉమ్ము వేస్తున్నట్టు సంచలన ఆరోపణ చేశారు. 

పండించేది హిందువుల రైతులు అని.. ముస్లింలు దళారులుగా ఉంటూ ఆ ప్రతిఫలాన్ని వారే లాగేసుకుంటున్నారని హిందూ మితవాద నేత ప్రశాంత్ సంబర్గి ఆరోపించారు. మరోపక్క, తాము మత సామరస్యాన్ని కోరుకుంటున్నామని, ఈ విధమైన ధోరణులకు తాము వ్యతిరేకమని కర్ణాటక మంత్రి అశ్వత్ నారాయణన్ అన్నారు.