Ali Sabry: శ్రీలంకలో దారుణ పరిస్థితులు... పదవి చేపట్టిన 24 గంటల్లోనే రాజీనామా చేసిన కొత్త ఆర్థికమంత్రి

Sri Lanka new finance minister Ali Sabry resigns within one day
  • శ్రీలంకలో మరింత ముదిరిన సంక్షోభం
  • కుప్పకూలే దిశగా ప్రభుత్వం
  • ఆర్థికమంత్రిగా బాధ్యతలు అందుకున్న అలీ సబ్రీ
  • అంతలోనే రాజీనామా

శ్రీలంకలో కొనసాగుతున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడంలేదు. ప్రభుత్వం కూడా చేతులెత్తేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ఉద్దేశంతో తన సోదరుడు బాసిల్ రాజపక్సను ఆర్థికమంత్రిగా తప్పించి, అలీ సబ్రీని కొత్తగా ఆర్థికమంత్రిగా చేసిన దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం బెడిసికొట్టింది. పదవి చేపట్టిన 24 గంటల్లోనే కొత్త ఆర్థికమంత్రి అలీ సబ్రీ రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సకు తన రాజీనామా లేఖను పంపారు. 

ఆర్థికమంత్రి పదవిని తాను తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే స్వీకరించానని అలీ సబ్రీ తన లేఖలో వెల్లడించారు. తన నిర్ణయం తక్షణమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. 

"ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఎంతో చర్చించిన మీదట, అనేక సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాను. గతంలో ఎన్నడూ తలెత్తని ఈ మహా సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో తగిన మధ్యంతర ఏర్పాట్లతో పాటు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం పూర్తిస్థాయి ఆర్థికమంత్రి అవసరం కూడా ఉందని భావిస్తున్నాను. ఈ నేపథ్యంలో నేను పదవిలో కొనసాగలేను" అని ఆయన పేర్కొన్నారు. తన వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని, దేశ ప్రయోజనాలే తనకు ముఖ్యమని అలీ సబ్రీ స్పష్టం చేశారు. 

తాజా నిర్ణయం నేపథ్యంలో, అలీ సబ్రీ మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు రాజీనామా చేసినట్టయింది. ఆయన ఇటీవలి వరకు శ్రీలంక న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. సంక్షోభం కారణంగా ఆయన కూడా రాజీనామా చేశారు. అయితే, తాజాగా ఆర్థికశాఖ అప్పగించగా, ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తూ తప్పుకున్నారు.

  • Loading...

More Telugu News