Sanjay Raut: నేను నోరు మూసుకుని కూర్చునే వ్యక్తిని కాను.. అన్ని విషయాలు బయట పెడతా: సంజయ్ రౌత్

Sanjay Raut fires on BJP after ED attachments of his family properties
  • శివసేన నేత సంజయ్ రౌత్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
  • తాను అందరిలా భయపడే వ్యక్తిని కాదన్న సంజయ్
  • గత ఏడాది సంజయ్ భార్యను విచారించిన ఈడీ
కేంద్ర ఏజెన్సీల గురించి భయపడే ప్రసక్తే లేదని శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు. తన మొత్తం ఆస్తులను కేంద్ర ఏజెన్సీలు సీజ్ చేసినా తాను లెక్క చేయనని వ్యాఖ్యానించారు. మనీ లాండరింగ్ కేసుల్లో తనను జైలుకు పంపించినా తాను భయపడనని అన్నారు. తాను నిఖార్సయిన శివసైనికుడినని చెప్పారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను పోరాడుతూనే ఉంటానని అన్నారు. 

చివరకు గెలిచేది సత్యమేనని సంజయ్ రౌత్ చెప్పారు. అందరిలా భయపడే వ్యక్తిని తాను కాదని అన్నారు. తాను బాలాసాహెబ్ థాకరే అనుచరుడినని... తనకు పోరాటం మాత్రమే తెలుసని, భయం తెలియదని చెప్పారు. ఎదుటి వాళ్లు నాటకాలు ఆడుతున్నారని బీజేపీపై మండిపడ్డారు. తాను నోరు మూసుకుని మౌనంగా కూర్చునే వ్యక్తిని కాదని... అన్ని విషయాలను బయటపెడతానని చెప్పారు.

సంజయ్ రౌత్ కు సంబంధించి అలీబాగ్ లో ఉన్న ఎనిమిది ల్యాండ్ ప్రాపర్టీలు, ముంబై దాదర్ సబర్బ్ లో ఉన్న ఒక ఫ్లాట్ ను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తులన్నీ ఆయన కుటుంబీకుల పేర్లపై ఉన్నాయి. మనీ లాండరింగ్ కింద ఈ ప్రాపర్టీలను అటాచ్ చేశారు. ఇది జరిగిన వెంటనే సంజయ్ రౌత్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

మరోవైపు, ముంబైలోని చావల్ ప్రాంతంలో రీడెవెలప్ మెంట్ కు సంబంధించి స్కామ్ జరిగిందని ఈడీ అధికారులు చెపుతున్నారు. గత ఏడాదే సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్ ను ఈడీ అధికారులు విచారించారు. వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్ భార్య మాధురికి సంబంధించిన పీఎంసీ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో వర్ష రౌత్ కు సంబంధం ఉందనే కోణంలో ఆమెను విచారించారు. తాజాగా ప్రవీణ్ రౌత్ పై ఛార్జ్ షీట్ వేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి.
Sanjay Raut
Shiv Sena
Enforcement Directorate
Attachments
BJP

More Telugu News