Sri Lanka: శ్రీలంకలో మెజారిటీ కోల్పోయిన సంకీర్ణ ప్రభుత్వం.. సంక్షోభంపై తాజా సమాచారం

  • కొత్త ఆర్థిక మంత్రి అలీసబ్రే రాజీనామా
  • కేబినెట్ మొత్తం మూకుమ్మడి రాజీనామాలు
  • పార్లమెంటులో మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం
  • కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలు
Sri Lanka ruling coalition loses parliament majority amid unrest

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో పాలనా సంక్షోభం కూడా తలెత్తింది. అధికార సంకీర్ణ కూటమి పార్లమెంటులో మెజారిటీ కోల్పోయింది. ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇచ్చిన పిలుపును ప్రతిపక్షాలు ఇప్పటికే తిరస్కరించాయి. 

ప్రధాని రాజపక్స కేబినెట్ లోని 26 మంత్రులు రాజీనామా చేయడంతో దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అయితే, తాను మాత్రం తన పదవి నుంచి తప్పుకోనని అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రకటించారు. పార్లమెంటులో 113 సీట్ల మెజారిటీ నిరూపించుకునే పార్టీకి అధికారం బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 

అధికార పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు 41 మంది సభ్యుల శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ ప్రకటించింది. తమ పార్టీ ప్రజల పక్షాన ఉందని శ్రీలంక ఫ్రీడమ్ పార్టీనేత మైత్రిపాల సిరిసేన ప్రకటించారు. 224 స్థానాలకు గాను గత ఎన్నికల్లో అధికార సంకీర్ణ కూటమికి 145 స్థానాల్లో విజయం లభించింది. 

2.2 కోట్ల జనాభా ఉన్న శ్రీలంకలో నిత్యావసరాలు కూడా లభించక ప్రజలు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతుండడం తెలిసిందే. కొలంబోలో అధ్యక్షుడి నివాసం ముందు కూడా ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్లు వచ్చాయి. అశాంతిని కట్టడి చేసేందుకు దేశంలో అత్యవసర పరిస్థితిని అధ్యక్షుడు ప్రకటించారు. 36 గంటల పాటు కర్ఫ్యూ నడిచింది. దీన్ని సోమవారం ఎత్తివేశారు. అయినా అల్లర్లు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 

ఆర్థిక మంత్రిగా బసిల్ రాజపక్సను తప్పించి, అలీ సబ్రేను నియమిస్తున్నట్టు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోమవారం ప్రకటించారు. కానీ, 24 గంటలు గడవక ముందే కొత్త ఆర్థిక మంత్రి అలీ సబ్రే సైతం రాజీనామా సమర్పించారు. భారీ రుణ భారంతో కుదేలవుతున్న శ్రీలంక ఆసియా అభివృద్ధి బ్యాంకు, భారత్, చైనా సాయాన్ని అర్థిస్తోంది.

More Telugu News