sodium: గుండె జబ్బులున్న వారు ఉప్పు తగ్గించుకుంటే మంచిదంటున్న తాజా అధ్యయనం!

  • కాళ్లలో వాపు తగ్గిపోతుంది
  • దగ్గు, అలసట నుంచి ఉపశమనం
  •  జీవన నాణ్యత మెరుగుపడుతుంది  
  • లాన్సెట్ పత్రికలో ప్రచురణ
Reducing sodium intake can help patients with heart failure

గుండె జబ్బులున్న వారు, గుండె వైఫల్యం బాధితులు ఉప్పు తగ్గించుకోవడం వల్ల వచ్చే లాభాలపై పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. దీని ఫలితాలు ప్రముఖ హెల్త్ జర్నల్ లాన్సెట్ లో ప్రచురితమయ్యాయి.

ఉప్పును తగ్గించడం వల్ల ఆసుపత్రుల్లో అత్యవసరంగా చేరాల్సి రావడం, మరణాల ముప్పు అయితే పెద్దగా తగ్గలేదు. కానీ, ఉప్పును తగ్గించినందున గుండె సమస్యలున్న వారికి రోజువారీ జీవనం మెరుగుపడినట్టు తెలిసింది. వాపు, అలసట, దగ్గు నుంచి వారికి ఉపశమనం లభించినట్టు పరిశోధకులు గుర్తించారు. మొత్తం మీద జీవన నాణ్యత మెరుగుపడిందని తేలింది.  

కెనడా, అమెరికా, కొలంబియా, చిలే, మెక్సికో, న్యూజిలాండ్ లోని 26 వైద్య కేంద్రాల్లో 806 మంది రోగులపై వైద్యులు ఈ అధ్యయనం నిర్వహించారు. 806 మంది కూడా హార్ట్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న రోగులే. ఈ స్థితిలో రక్తాన్ని గుండె సమర్థవంతంగా పంప్ చేయలేదు. అదే సమయంలో ఉప్పు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిలిచేలా చేస్తుంది. ఇదే కాళ్లు, ముఖంపై వాపునకు దారితీస్తుంది. 

ఈ రోగులను రెండు బృందాలుగా చేశారు. ఒక గ్రూపులోని రోగులు పోషకాహార నిపుణుల సూచనల మేరకు బయట ఆహారానికి దూరంగా ఉంటూ, ఇంట్లోనే ఉప్పు లేకుండా వంటలు చేసుకోవడం, అధిక ఉప్పు ఉండే పదార్థాలకు దూరంగా ఉండేలా చూశారు. మరొక బృందంలోని వారికి రోజు మాదిరే ఆహారం తీసుకోవాలని సూచించారు. నిపుణుల సూచనలను అనుసరించే గ్రూపులోని రోగులు నిత్యం 1,658 మిల్లీ గ్రాముల ఉప్పు మించకుండా చర్యలు తీసుకున్నారు. మరో గ్రూపులోని వారు 2,072 మిల్లీ గ్రాముల ఉప్పు తీసుకునేలా చూశారు. 

ఈ రెండు గ్రూపుల్లోని వారు అత్యవసరంగా ఆసుపత్రుల్లో చేరాల్సి రావడం, ఏదైనా కారణంతో మరణించడం వంటి వాటిల్లో పెద్ద వ్యత్యాసం కనిపించలేదు. కానీ, ఉప్పు తగ్గించడం వల్ల జీవన నాణ్యత మెరుగుపడినట్టు వెల్లడైంది. ఈ పరిశోధనలో పాల్గొన్న కార్డియాలజిస్ట్ ఎజెకోవిట్జ్ మాట్లాడుతూ.. రోగులకు ఆహార పరమైన మార్పులను సూచించడం ఉపయోగకరమన్నది వైద్యులు గుర్తించాలన్నారు.

More Telugu News