IPL 2022: మరోమారు తేలిపోయిన సన్‌రైజర్స్ బ్యాటింగ్.. వరుసగా రెండో ఓటమి

  • త్రిపాఠి, పూరన్ మినహా రాణించలేకపోయిన బ్యాటర్లు
  • హైదరాబాద్‌ను దెబ్బకొట్టిన అవేశ్ ఖాన్, హోల్డర్
  • నాలుగు వికెట్లు పడగొట్టిన అవేశ్‌ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
Avesh four fer halts SRH chase

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. ఈసారి బౌలర్లు కాస్తంత పర్వాలేదనిపించినా, బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు, దీపక్ హుడా మరోమారు బంతిపై విరుచుకుపడడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 169 పరుగులు చేసింది. 


170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్‌ను లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ దారుణంగా దెబ్బతీశాడు. తొలుత ఓపెనర్లు అభిషేక్ శర్మ (13), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (16)ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత డెత్ ఓవర్లలో ప్రమాదకర ఆటగాడు నికోలస్ పూరన్ (34), అబ్దుల్ సమద్ (0)లను పెవిలియన్ పంపి హైదరాబాద్ గెలుపు ఆశలపై దెబ్బకొట్టాడు. నిజానికి పూరన్ క్రీజులో ఉన్నంత వరకు హైదరాబాద్ జట్టు విజయం దిశగా సాగుతున్నట్టుగానే కనిపించింది. మూడు ఫోర్లు, 2 సిక్సర్లు బాది వేగం పెంచాడు. అయితే, అతడు అవుటయ్యాక వరుసపెట్టి వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. 

జట్టులో రాహుల్ త్రిపాఠి (30 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 44 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, పూరన్ చేసిన 34 పరుగులు రెండో అత్యధికం. చివరి ఓవర్‌లో జట్టు విజయానికి 16 పరుగులు అవసరం కాగా, వాషింగ్టన్ సుందర్ (18), భువనేశ్వర్‌ (1), రొమారియో షెపర్డ్ (8)లను హోల్డర్ పెవిలియన్ పంపడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 157/9 వద్ద ముగిసింది. ఫలితంగా లక్నో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

మూడు మ్యాచ్‌లు ఆడిన లక్నోకు ఇది రెండో విజయం కాగా, రెండు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఇంకా ఖాతా తెరవలేదు. లక్నో బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవేశ్ ఖాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా, హోల్డర్‌కు మూడు, కృనాల్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి తొలుత నిదానంగా ఆడారు. క్రీజులో కుదురుకున్నాక బంతి పనిపట్టారు. దీంతో జట్టు మళ్లీ గాడిన పడింది. హుడా 33 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో మూడో అర్ధ సెంచరీ (51) పూర్తి చేసుకున్నాడు. రాహుల్ 50 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 68 పరుగులు చేసి జట్టును గట్టెక్కించాడు. 

ఆయుష్ బడోని 12 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేయడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. డికాక్ (1), లూయిస్ (1), మనీష్ పాండే (11), కృనాల్ పాండ్యా (6) దారుణంగా నిరాశపరిచారు. హైదరాబాద్ బౌలర్లలో సుందర్, షెపర్డ్, నటరాజన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి.

More Telugu News