DK Shivakumar: డీకేకు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన కేటీఆర్‌

  • ఖాతాబుక్ సీఈఓను హైద‌రాబాద్‌ ఆహ్వానించిన కేటీఆర్‌
  • దానిని ఓ స‌వాల్‌గా స్వీక‌రిస్తున్నాన‌ని చెప్పిన డీకే
  • బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌ల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీని కొన‌సాగిద్దామ‌న్న కేటీఆర్ 
  • హ‌లాల్‌,హిజాబ్‌ల‌పై దృష్టి సారించొద్దంటూ చుర‌క‌
ktr strong counter to dk shiva kumar

తెలంగాణ‌కు ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆహ్వానించే క్ర‌మంలో ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోకుండా చాకచ‌క్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.. క‌ర్ణాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ వ్యాఖ్య‌ల‌పై చాలా వేగంగానే స్పందించారు. ఈ మేర‌కు డీకే శివ‌కుమార్ త‌న ట్వీట్‌పై సంధించిన వ్యాఖ్య‌ల‌కు కేటీఆర్ కూడా అదే స్పీడుతో ప్ర‌తిస్పందించారు. 

ఇండియ‌న్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగ‌ళూరులో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తే.. క‌నీస సౌకర్యాలు కూడా క‌ల్పించ‌డం లేద‌ని ఖాతాబుక్ సీఈఓ ఆవేద‌న వ్యక్తం చేయ‌గా.. త‌క్ష‌ణ‌మే మూటాముల్లె స‌ర్దుకుని హైద‌రాబాద్ వ‌చ్చేయండి అంటూ మొన్న కేటీఆర్ ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై సోమ‌వారం డీకే శివ‌కుమార్ స్పందించారు. కేటీఆర్ ఆహ్వానాన్ని స‌వాల్‌గా తీసుకుంటా‌మ‌ని చెప్పిన డీకే.. 2023 చివ‌రి నాటికి క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంద‌ని, బెంగ‌ళూరుకు పూర్వ వైభవం తీసుకువస్తామ‌ని చెప్పుకొచ్చారు.

డీకే శివ‌కుమార్ ట్వీట్‌ను చూసిన కాసేప‌టికే కేటీఆర్ స్పందించారు. డీకే శివ‌కుమార్‌ను అన్నా అంటూ సంబోధించిన కేటీఆర్‌.. క‌ర్ణాట‌క రాజ‌కీయాల గురించి త‌న‌కేమీ పెద్దగా తెలియ‌ద‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల్లో గెలిచేదెవ‌ర‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టి ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు చెప్పారు. బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌ల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీని కొన‌సాగిద్దామ‌ని పిలుపునిచ్చిన కేటీఆర్‌..యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌న‌తో పాటు దేశాభివృద్ధికి పాటు ప‌డ‌దామ‌ని కోరారు. 

ఆ త‌ర్వాత కాస్తంత ఘాటు పెంచిన కేటీఆర్‌.. ముందుగా ఇన్‌ఫ్రా, ఐటీ, బీటీ (బ‌యో టెక్నాల‌జీ) మీద దృష్టి పెట్టాల‌ని డీకేకు సూచించారు.  అది మ‌రిచి హ‌లాల్‌, హిజాబ్‌ల మీద దృష్టి సారించొద్ద‌ని హిత‌వు చెప్పారు. క‌ర్ణాట‌క విద్యాల‌యాల్లో హిజాబ్‌పై రేగిన వివాదం దేశ‌వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌ను రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే క‌దా. అదే విష‌యాన్ని గుర్తు చేస్తూ డీకేకు కేటీఆర్ చుర‌క‌లు అంటించారు.

  • Loading...

More Telugu News