Chandrababu: అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతాం: చంద్రబాబు

  • ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు
  • పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం
  • కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదని విమర్శలు
  • రాజకీయ కోణం కనిపిస్తోందని విమర్శ 
Chandrababu opines on new districts

టీడీపీ అధినేత చంద్రబాబు తాజా రాజకీయ, రాష్ట్ర పరిస్థితులపై పార్టీ నేతలతో చర్చించారు. సీఎం జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ప్రధాని వద్ద ఉన్నతాధికారుల వ్యాఖ్యలే రాష్ట్ర పరిస్థితికి నిదర్శనం అని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉందని, రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయం అని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

విద్యుత్ చార్జీల పెంపు, పన్నుల భారంపై 'బాదుడే బాదుడు' పేరుతో ఇంటింటి ప్రచారం చేస్తామని చెప్పారు. కరెంటు ఎందుకు పోతోందో, బిల్లులు ఎందుకు పెరిగాయో సీఎం చెప్పాలని నిలదీశారు. జగన్ వ్యక్తిగత ఆదాయం కోసమే ప్రజలపై తీవ్ర భారం మోపారని చంద్రబాబు ఆరోపించారు. 

అక్రమ మద్యం రవాణా ద్వారా జగన్ వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే నెం.2 మద్యం అమ్ముతున్నారని పేర్కొన్నారు. కల్తీ మద్యం, జె-ట్యాక్స్ పై పోరాటం కొనసాగిస్తామని చంద్రబాబు ఉద్ఘాటించారు. 

అమరావతిలో 80 శాతం జరిగిన పనులను కూడా జగన్ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. జగన్ పాలనపై ఆయన సొంత సామాజిక వర్గం కూడా సంతృప్తిగా లేదని అన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం పదవులు ఇస్తున్నారని, జగన్ కు ఓటేసి తప్పుచేశామన్న భావన ఇప్పుడు సొంత వర్గంలోనే ఉందని తెలిపారు. సీపీఎస్ అంశంలో ఆందోళనలు చేపడుతున్న వారికి టీడీపీ మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

More Telugu News