Doctors: కిడ్నీల ఆరోగ్యానికి ఆచరించాల్సినవి ఇవే..!

Doctors share simple tips to keep your kidneys healthy
  • రోజులో కనీసం రెండు లీటర్ల నీరు
  • నిత్యం నడక లేదా పరుగు
  • క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు అవసరం
  • సొంతంగా ఔషధ సేవనం మంచిది కాదు
చిన్న పరిమాణంలో చిక్కుడు గింజల ఆకారంలో ఉండే మూత్రపిండాలు ( కిడ్నీలు) మన శరీర నిర్మాణంలో అత్యంత కీలకమైన అవయవాల్లో ఒకటి. రక్తంలోకి చేరిన జీవక్రియల వ్యర్థాలను వడకట్టి బయటకు పంపించడంతోపాటు.. రక్తపోటు నియంత్రణకు సాయపడుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు, శరీరంలో లవణాలు సమతుల్యంగా ఉండేందుకు కిడ్నీలు కీలకంగా వ్యవహరిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి మనం ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. 

కిడ్నీల్లో సమస్య ఏర్పడితే వెంటనే బయటకు కనిపించకపోవచ్చు. అందుకే కిడ్నీ జబ్బులను సైలంట్ కిల్లర్ అని చెబుతారు. యుక్త వయసులో ఏడాదికోసారి,  మధ్య వయసు దాటిన తర్వాత నుంచి ఆరు నెలలకు ఒకసారి అయినా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

వ్యాయామం
రక్తపోటు నియంత్రణలో పెట్టుకోకపోతే అది కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుందని గుర్తుంచుకోవాలి. ఇందుకోసం నిత్యం వ్యాయామం చేయాలి. పరుగు, సైక్లింగ్, జాగింగ్, డ్యాన్స్ చేసినా కిడ్నీలకు మంచిదే. ఇలా శారీరక శ్రమ ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవాలి.

నీరు
తగినంత నీరు తీసుకోవడం కూడా కిడ్నీల ఆరోగ్యానికి అవసరం. రోజులో కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. అంటే రెండు లీటర్లు. నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో అదనంగా ఉన్న సోడియం, వ్యర్థ పదార్థాలను మూత్రపిండాలు బయటకు పంపించగలవు. అప్పుడు కిడ్నీలపై చెడు ప్రభావం పడదు. 

నీరు తగినంత తీసుకోకపోతే అధిక సోడియం, వ్యర్థాలు శరీరంలో ఉండిపోయి కిడ్నీలకు హాని చేస్తాయి. రోజుకు మూడు లీటర్ల నీరు కూడా తీసుకోవచ్చు. వయసు, ఉష్ణోగ్రతలు, ఆరోగ్య సమస్యలు ఇలాంటి అంశాల ఆధారంగా తీసుకోవాల్సిన నీటి పరిమాణం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో వైద్యులను సంప్రదించి ఎవరికి వారు సూచన పొందాలి.

పొగతాగడం 
పొగతాగడం అన్నది రక్త నాళాల పూడికకు లేదా దెబ్బతినడానికి కారణమవుతుంది. కిడ్నీల్లో రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. పొగతాగడం వల్ల రీనల్ సెల్ కార్సినోమా (కిడ్నీ కేన్సర్)కు దారితీసే ప్రమాదం ఉంది. 

క్రమం తప్పకుండా పరీక్షలు
మధుమేహులు, తక్కువ బరువుతో పుట్టిన వారు, గుండె జబ్బులున్న వారు, అధిక రక్తపోటు, ఊబకాయం ఉన్నవారు, కుటుంబంలో కిడ్నీ జబ్బుల చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 

సొంతంగా ఔషధ సేవనం
వైద్యులు సూచించినప్పుడే ఔషధాలు తీసుకోవాలి. సొంతంగా వాటిని ఫార్మసీ స్టోర్లలో కొనుగోలు చేసి వాడుకోవడం మంచిది కాదు. ఎందుకంటే కొన్ని రకాల మందులు కిడ్నీలకు హాని చేస్తాయి. వీటిని ఎక్కువ రోజుల పాటు తీసుకోకూడదు. అందుకే సొంత వైద్యం మానుకోవాలి.
Doctors
health
kidneys
tests

More Telugu News