Pudding and Mink: ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలితే వారి పేర్లు మేమే వెల్లడిస్తాం: పోలీసులు

  • పుడింగ్ అండ్ మింక్ పబ్ పై దాడులు
  • మీడియాతో మాట్లాడిన డీసీపీ జోయల్ డేవిస్ 
  • పబ్ లో 148 మంది ఉన్నారని వెల్లడి
  • మీడియాలో కస్టమర్ల జాబితా చూపిస్తున్నారని ఆరోపణ
DCP Joel Davis media talk

హైదరాబాదులోని పుడ్డింగ్ అండ్ మింక్ పై దాడులకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. దీనిపై డీసీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ, పబ్ 24 గంటలు తెరిచి ఉంటుందని ప్రచారం చేసి కస్టమర్లను ఆహ్వానించారని, అది నమ్మి అనేకమంది కస్టమర్లు పబ్ కు వచ్చి ఉండొచ్చని వివరించారు. 

అయితే, పబ్ కు వచ్చిన కస్టమర్ల జాబితాను మీడియాలో చూపిస్తున్నారని తెలిపారు. పబ్ కు వచ్చిన వారి పేర్లు బయటపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. వారిలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలితే వారి పేర్లు తామే వెల్లడిస్తామని డీసీపీ స్పష్టం చేశారు. అనుమానం ఉన్నవారి నుంచి శాంపిల్స్ సేకరిస్తామని తెలిపారు. 

కాగా, పబ్ పై దాడి సమయంలో మేనేజర్ కాబిన్ వద్ద ఐదు కొకైన్ ప్యాకెట్లు దొరికాయని వెల్లడించారు. మేనేజర్ గతంలో గోవాలో ఓ పబ్ లో పనిచేసి ఇక్కడికి వచ్చాడని, ఈ కేసులో గోవా లింకులు ఏమైనా ఉన్నాయేమో తేలాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారం పబ్ యజమానులకు తెలియకుండా జరిగే అవకాశం లేదని, అందుకే వారిపైనా కేసు నమోదు చేశామని తెలిపారు. 

గతేడాది ఆగస్టు నుంచి ఈ పబ్ కొత్త మేనేజ్ మెంట్ చేతుల్లోకి వచ్చిందని డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. పూర్తి వివరాలు సేకరించిన మీదట పబ్ ఓనర్ అర్జున్ వీరమాచినేని, అభిషేక్ ముప్పాల, పబ్ జీఎం అనిల్ లపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 

ఈ పబ్ లో ఎవరైనా అడుగుపెట్టాలంటే ఓ యాప్ సాయంతో ఓటీపీ ఎంటర్ చేస్తేనే అనుమతి లభిస్తుందని వివరించారు. తాము దాడి చేసిన సమయంలో పబ్ లో 148 మంది ఉన్నారని, వారిలో ప్రతి ఒక్కరినీ నిశితంగా పరిశీలించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

More Telugu News