Rahul Sipligunj: అన్నా నిజం చెబుతున్నా... అసలు డ్రగ్స్ ఎలా ఉంటాయో ఇంతవరకు చూడలేదు: రాహుల్ సిప్లిగంజ్

  • ఫుడింగ్ మింక్ పబ్ పై పోలీసుల దాడులు
  • పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఎందుకు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారో తెలియదన్న రాహుల్
  • తనకు డ్రగ్స్ అలవాటు లేదని స్పష్టీకరణ
Rahul Sipligunj talks about pub issue

బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న ఫుడింగ్ మింక్ పబ్ పై దాడి చేసిన పోలీసులు అనేకమందిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. వారిలో టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. తన పేరు ఎక్కువగా వినిపిస్తుండడం పట్ల రాహుల్ ఓ మీడియా చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటుంటే పబ్ కు వెళ్లానని రాహుల్ వెల్లడించారు. 

పోలీసుల దాడులకు అరగంట ముందు పబ్ కు వెళ్లానని, స్నేహితులను పలకరించి వచ్చేద్దామనుకున్నానని వివరించారు. ఈ వ్యవహారాన్ని డ్రగ్స్ కేసు అంటున్నారని, ఆధారాలు ఉంటే డ్రగ్స్ తీసుకున్నవాళ్లనో, పబ్ మేనేజర్ నో పట్టుకోవాలని అన్నారు. 

"నేను డ్రగ్స్ తీసుకున్నాననడం అవాస్తవం. కావాలంటే డీఎన్ఏ టెస్టుకు నా శాంపిల్స్ ఇస్తాను. పోలీసులు నిర్వహించే డ్రగ్స్ అవేర్ నెస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే నేను ఎలా డ్రగ్స్ తీసుకుంటాను? అన్నా, నిజం చెబుతున్నా... ఇంతవరకు నాకు డ్రగ్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఒక్కసారి కూడా వాటిని చూడలేదు. నేను పబ్ నుంచి వచ్చే సమయంలో పోలీసులు ఆపారు. వాళ్లు ఎందుకు ఆపారో ఆ సమయంలో నాకు తెలియలేదు. 

పబ్ లో 200 మంది వరకు ఉన్నారు. మా ఫ్రెండ్ తన కుటుంబంతో కలిసి వచ్చాడు. మేమందరం కలిసి పార్టీ చేసుకున్నాం. పబ్ ను నిర్ణీత సమయం తర్వాత కూడా నడిపిస్తే అది మా సమస్య కాదు. నిర్ణీత సమయం తర్వాత పబ్ లో ఉండడం తప్పే అయినా, పబ్ లోంచి బయటికి రావడానికే 40 నిమిషాలు పడుతుంది. 

పోలీసులు పబ్ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకువచ్చారో తెలియదు. అడిగితే, పైనుంచి ఆర్డర్స్, రావాలని చెప్పారు. మీడియాలో మాత్రం అడ్డంగా దొరికిపోయారు అంటూ మా ముఖాలు చూపించి ప్రచారం చేస్తున్నారు. నేను సింగర్ ని, నాకు డ్రగ్స్ తో పనేంటి? మాకు కూడా కుటుంబాలు ఉంటాయని ఆలోచించరా?" అంటూ రాహుల్ సిప్లిగంజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News