IPL 2022: ఢిల్లీ బౌలర్లను బెంబేలెత్తించిన ఫెర్గ్యూసన్.. గుజరాత్‌కు రెండో విజయం

Ferguson and Gill fire GT to second win
  • ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్న గుజరాత్ టైటాన్స్
  • ఢిల్లీకి తొలి పరాజయం
  • నాలుగు వికెట్లు తీసిన ఫెర్గ్యూసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

ఐపీఎల్‌లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ మరోమారు మెరిసింది. గతరాత్రి పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శుభమన్‌గిల్ బంతిపై విరుచుకుపడడంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసి విజయానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

గుజరాత్ బౌలర్ లాకీ ఫెర్గ్యూసన్ నాలుగు వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను చెల్లాచెదురు చేశాడు. షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. వీరి బంతులను అడ్డుకోలేకపోయిన బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు. కెప్టెన్ పంత్ 43, లలిత్ యాదవ్ 25, రోవ్‌మన్ పావెల్ 20 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. ఢిల్లీకి ఇది తొలి పరాజయం.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్‌ తొలి ఓవర్ మూడో బంతికే వేడ్ (1) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత విజయ్ శంకర్ (13) క్రీజులోకి వచ్చాడు. అతడితో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిచేసిన మరో ఓపెనర్ శుభమన్ గిల్ బ్యాట్‌తో బౌలర్లను ఆడేసుకున్నాడు. 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు పిండుకుని నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. అతడి బ్యాటింగ్ జోరుతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. 

కెప్టెన్ హార్దిక్ పాండ్యా (31), మిల్లర్ (20) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, ఖలీల్ అహ్మద్ 2, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. నాలుగు వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటర్లను బెంబేలెత్తించిన ఫెర్గ్యూసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతాయి.

  • Loading...

More Telugu News