Ramzan: రంజాన్ నేపథ్యంలో.. ముస్లిం ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ‌ స‌ర్కారు

  • శ‌నివారంతో మొద‌లైన రంజాన్ మాసం
  • మే 2 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న ఉప‌వాసాలు
  • సాయంత్రం గంట ముందుగానే ఇంటికి ముస్లిం ఉద్యోగులు
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్‌
Telangana govt permits Muslim employees to leave early during Ramzan

ముస్లిం సోద‌రులు ప‌విత్ర మాసంగా ప‌రిగ‌ణించే రంజాన్ మాసం శ‌నివారం నుంచి ప్రారంభ‌మైంది. ఏప్రిల్ 2 నుంచి మే 2 దాకా రంజాన్ మాసం కొన‌సాగ‌నుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప‌నిచేసే ముస్లిం ఉద్యోగుల‌కు తెలంగాణ స‌ర్కారు శుభవార్త చెప్పింది. రంజాన్ మాసంలో విధుల‌కు హాజ‌ర‌య్యే ముస్లిం ఉద్యోగులు సాయంత్రం వేళ 4 గంట‌ల‌కే ఇళ్ల‌కు వెళ్లేందుకు అనుమ‌తినిచ్చింది. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

రంజాన్ మాసంలో ముస్లిం సోద‌రులు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేయ‌నున్న‌ సంగ‌తి తెలిసిందే. అదే స‌మయంలో నెల మొత్తం ముస్లిం సోద‌రులు ఉప‌వాస దీక్ష‌లు కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో సాయంత్రం వేళ ముస్లిం ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రార్థ‌న‌లు కొన‌సాగించేందుకు సాయంత్రం గంట ముందుగానే ఇళ్ల‌కు వెళ్లే వెసులుబాటు క‌ల్పించింది. ఈ వెసులుబాటు అన్ని ప్ర‌భుత్వ శాఖలు, కార్పొరేష‌న్ల‌లో ప‌నిచేసే ముస్లిం ఉద్యోగులంద‌రికీ వ‌ర్తిస్తుంద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం త‌న ఉత్త‌ర్వుల్లో వెల్ల‌డించింది.

More Telugu News