STROKE: ఈ లక్షణాలు కనిపిస్తే.. స్ట్రోక్ రిస్క్ ఉందేమో చూపించుకోవాలి!

Know who is at risk and how to identify the symptoms of stroke
  • తల తిరగడం, కంటి చూపులో అస్పష్టత
  • నడుస్తుంటే బ్యాలన్స్ తప్పడం
  • ఎదుటి వారు చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం
  • ముఖంపై తిమ్మిర్లు, చేతుల్లో అసౌకర్యం

స్ట్రోక్ అన్నది వైద్యపరమైన అత్యవసర స్థితి. వెంటనే చికిత్స అందించాలి. లేదంటే కొన్ని అవయవాలు పనిచేయకపోవడం, కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. స్ట్రోక్ ను తీవ్రత ఆధారంగా పక్షవాతంగానూ చెబుతారు. 

స్ట్రోక్ అంటే?
మెదడు కణజాలానికి రక్తం, ఆక్సిజన్ సరఫరాలో ఆటంకం ఏర్పడినప్పుడు ఏర్పడే పరిస్థితినే స్ట్రోక్ గా చెబుతారు. దెబ్బ కారణంగా లేదా, ఒత్తిడి కారణంగా నరాలు చిట్లి రక్త స్రావం అయినా, రక్తం గడ్డ కట్టినా స్ట్రోక్ ఎదురవుతుంది. స్ట్రోక్ లో రెండు రకాలు. ఒకటి ఇస్చెమిక్. రక్త ప్రవాహంలో ఆటంకాలు, రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడే స్థితి ఇది. 87 శాతం స్ట్రోక్ కేసులకు ఇదే కారణం.  రెండోది హెమరాజిక్. ఇది రక్తస్రావం వల్ల ఏర్పడే స్ట్రోక్. మెదడు రక్త నాళాలు (ధమనులు) చిట్లినప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. 

స్ట్రోక్ సంకేతాలు
నడుస్తున్నప్పుడు బలహీనంగా అనిపించడం, బ్యాలన్స్ తప్పుతున్నట్టు అనిపించడం. చూపు కష్టంగా మారడం. అంటే కళ్ల ముందు కనిపించే దృశ్యాలను చూసే విషయంలో ఇబ్బందిగా అనిపించడం. ముఖంలో తిమ్మిర్లు అనిపించడం. చేతులు పైకి ఎత్తినప్పుడు కష్టంగా భావించడం. చేతుల్లో బలహీనత. మాట్లాడడం కష్టంగా, ఇబ్బందిగా అనిపించడం. అయోమయం, ఎదుటి వారు చెప్పింది ఒక్కసారిగా అర్థం చేసుకోలేకపోవడం, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం.. వీటిని స్ట్రోక్ సంకేతాలుగానే చూడాలి. వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా సమస్యను నిర్ధారణ చేసుకోవచ్చు. 

వీరికి రిస్క్ ఎక్కువ
అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, గుండె జబ్బులు, గుండె కవాటాల్లో సమస్యలు, మధుమేహం, రక్తం గడ్డకట్టే సమస్యలున్నవారికి స్ట్రోక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. శారీరక వ్యాయామం లేని వారు, అధికంగా ఆల్కహాల్ తీసుకునే వారు, పొగ తాగేవారికి కూడా ఈ రిస్క్ ఎక్కువే.

  • Loading...

More Telugu News