Russia: రష్యా, జర్మనీ మృతి.. అమెరికా, ఆఫ్రికా, జపాన్ ల ఆవేదన!

  • బీహార్ లోని సోదరుల ఆసక్తికరమైన కథ
  • పంచ సోదరులకు దేశాల పేర్లు పెట్టిన తండ్రి
  • అకుల్ శర్మ అనే మాజీ సైనికుడి కోరిక మేరకు ఆయన సోదరుడి నిర్ణయం
  • 2012లో రష్యా, 2017లో జర్మనీ మరణం
Russia and Germany Dies America Africa and Japan Feels Bad

రష్యా, జర్మనీ చనిపోయారు. వారి మరణంతో అమెరికా, జపాన్, ఆఫ్రికాలు తెగ ఆందోళన చెందుతున్నారు. అవును, మీరు చదివింది అక్షరాలా నిజమే. దేశాలు చనిపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా? వాళ్లు మనలాగా మామూలు మనుషులే. కాకపోతే దేశాల పేర్లను పెట్టుకున్నారంతే. బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని జమాదర్ తోలా అనే గ్రామానికి చెందిన వీళ్లంతా అన్నదమ్ములు. 

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అకుల్ శర్మ అనే ఓ వ్యక్తి భారత సైన్యంలో చేరాడు. చాన్నాళ్ల పాటు అందులో సేవలందించాడు. ఓ సారి యుద్ధంలో ఆయన్ను శత్రు దేశాల సైనికులు కాల్చారు. ఆ గాయాలకు స్వగ్రామంలోనే చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోదరుడికి కొడుకు పుట్టాడు. అయితే, అమెరికా అని నామకరణం చేయాలంటూ అకుల్ శర్మ కోరడంతో మారు చెప్పకుండా.. ఆయన సోదరుడు తన పెద్దకొడుకుకు అమెరికా శర్మ అని పేరు పెట్టాడు. 

ఆ తర్వాత పుట్టిన వాళ్లకు ఆఫ్రికా శర్మ, జర్మనీ శర్మ, రష్యా శర్మ, జపాన్ శర్మ అని నామకరణం చేశాడు. అయితే, 2012లో రష్యా శర్మ చనిపోగా.. 2017లో జర్మనీ శర్మ చనిపోయాడు. చనిపోయిన ఆ ఇద్దరు సోదరులను తలచుకుంటూ మిగతా ముగ్గురు అమెరికా, ఆఫ్రికా, జపాన్ శర్మలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అందరం కమ్మరి వృత్తే జీవనాధారంగా చేసుకున్నామని జపాన్ శర్మ తెలిపారు. 

అయితే, ఓసారి ఆసక్తికరమైన ఘటన జరిగిందట. పొరుగువారితో గొడవ జరగ్గా.. వాళ్లు కేసుపెట్టారని, అయితే, అత్యంత శక్తిమంతమైన దేశాల పేర్లు పెట్టుకున్న వారిపై కేసు పెట్టలేమని పోలీసులు చెప్పారట. రష్యా–ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధంపై మిగతా ముగ్గురు సోదరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రెండు దేశాలూ తమలాగే సోదరుల్లా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారు.

More Telugu News