Ugadi: ఉగాది పచ్చడిలో ఏముంది?

ugadi pachadi has medicinal effects
  • ఆరు రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి
  • ఇవన్నీ కూడా శరీరానికి కావాల్సినవి
  • సహజ ఔషధ గుణాలు కలిగినవి
  • జీవ క్రియల్లో సాయపడతాయి
తెలుగు నూనత సంవత్సరాది ఉగాది రోజున ప్రజలు అందరూ ఉగాది పచ్చడి పేరుతో ఆరు రకాల రుచుల సమ్మేళనాన్ని స్వీకరించే ఒక సంప్రదాయం ఆచరణలో ఉంది. తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు అన్నీ కలిస్తేనే ఉగాది పచ్చడి. నిత్య జీవితంలో ఎన్నో పదార్థాలు తీసుకుంటూ ఉంటాం. అన్నింటిలోనూ ఉండేవి ఈ రుచులే. జీవితం కూడా ఉగాది పచ్చడి మాదిరే అన్నింటి కలబోతగా ఉంటుంది. ఈ షడ్రుచులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఉగాది పచ్చడిలోకి వేర్వేరు పదార్థాలను ప్రాంతాల వారీగా చేరుస్తుంటారు. కారం కోసం ఎండుకారం లేదా మిరియాలు లేదా పచ్చి మిరపకాయను వాడతారు. తీపి కోసం బెల్లం లేదా పంచదార లేదా చెరకు రసం లేదా అరటిపండు, వాడుతుంటారు. చేదు కోసం వేప పువ్వు, పులుపు కోసం చింతపండు, వగరు కోసం మామిడి పిందెలను వినియోగించడాన్ని చూడొచ్చు.

చేదు
చేదు కింద తీసుకునే వేపకు ఔషధ గుణాలున్నాయి. శరీరంలో కఫ దోషాన్ని వేపలో ఉండే చేదు తగ్గిస్తుంది. కడుపులో పురుగులను చంపే గుణం వేపకు ఉంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి, మలినాలను బయటకు పంపడానికి సాయపడుతుంది. 

తీపి
తీపి మంచిది కాదని చెబుతుంటారు. ఇది కొంత వరకే నిజం. మన శరీరానికి తీపి కూడా అవసరమే. శరీరంలోని కణాలకు శక్తినిచ్చే పదార్థం కార్బొహైడ్రేట్లు. ఇవి ధాన్యాలు, పండ్లు, కూరగాయల రూపంలో లభిస్తాయి. తీపి అన్నది వాత, పిత్త దోషాలు పెరగకుండా చూస్తుంది. కనుక శరీరానికి కావాల్సిన మేర తీపిని అందివ్వాలి.

పులుపు
పులుపును కూడా పరిమితంగా తీసుకోవాలి. ఎక్కువ కాకూడదు. పరిమితంగా తీసుకుంటే జీర్ణక్రియకు సాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. 

ఉప్పు
మన శరీరానికి సోడియం అవసరం ఎంతో ఉంది. లవణాల సమతుల్యం దెబ్బతినకుండా చూసుకోవాలి. నాడీ ప్రేరణలు, కండరాల వ్యాకోచ, సంకోచాలకు, నీరు, ఖనిజాల నిల్వలకు ఉప్పు అవసరం. కనుక మోతాదుకు మించకుండా ఉప్పును చేర్చుకోవాలి.

కారం
శరీరంలో వేడిని కలిగించడానికి, ఆహారం జీర్ణం కావడానికి, బరువు తగ్గడానికి సాయపడుతుంది. శరీరానికి ఉత్తేజాన్ని కూడా ఇస్తుంది.

వగరు
శరీరం దృఢంగా ఉండేందుకు వగరు పనిచేస్తుంది. చెమట ఎక్కువగా పట్టకుండా చూస్తుంది. వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందని తెలిసిందే. దీన్ని కూడా పరిమితి మించనీయకూడదు. 

Ugadi
pachadi
telugu
new year

More Telugu News