Hollywood: ప్రజెంటర్‌ను చెంపదెబ్బకొట్టిన హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ పశ్చాత్తాపం.. ఫిల్మ్ అకాడమీకి రాజీనామా

Will Smith resigns from film academy over Oscars slap
  • ఆస్కార్ వేడుకల్లో స్మిత్ భార్యపై జోక్ చేసిన ప్రజెంటర్ రాక్
  • స్టేజిపైకి వెళ్లి చెంపదెబ్బ కొట్టిన విల్‌స్మిత్
  • అలా చేయడం క్షమించరానిదని పశ్చాత్తాపం
  • ఎలాంటి చర్యలకైనా సిద్ధమన్న స్మిత్
ఆస్కార్ వేడుకల్లో ప్రజెంటర్‌ను చెంపదెబ్బ కొట్టిన హాలీవుడ్ ప్రముఖ నటుడు విల్ స్మిత్ హాలీవుడ్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు రాజీనామా చేశాడు. ఆస్కార్ వేడుకలో వేదికపై ప్రజెంటర్ క్రిస్ రాక్‌ను తాను చెంపదెబ్బ కొట్టడం ‘షాకింగ్, బాధాకరమైనది మాత్రమే కాకుండా క్షమించరానిదని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అకాడమీ నమ్మకాన్ని తాను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇతర నామినీలు, విజేతలు ఆ ఆనందాన్ని ఉత్సాహంగా జరుపుకునే అవకాశాన్ని తాను పోగొట్టానని విచారం వ్యక్తం చేశాడు. నిజంగా ఇది బాధాకరమని, తన గుండె పగిలిందని అన్నాడు. 

అందుకనే తాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్సర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పాడు. అంతేకాదు, తనపై ఏవైనా చర్యలు తీసుకోవాలనుకున్నా వాటిని తాను అంగీకరిస్తానని చెప్పుకొచ్చాడు. కాగా, గత ఆదివారం జరిగిన ఆస్కార్ వేడుకల్లో విల్‌స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ రూపం గురించి ప్రజెంటర్ రాక్ జోక్ చేశాడు. ఇది జీర్ణించుకోలేని స్మిత్ వేదికపైకి దూసుకెళ్లి రాక్ చెంప చెళ్లుమనిపించాడు. ఆ తర్వాత గంటలోపే ‘కింగ్ రిచర్డ్’ సినిమాలో పాత్రకు గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న స్మిత్ వేదికపై నుంచి కన్నీళ్లతో ప్రసంగించాడు.
Hollywood
Will Smith
Oscar Awards
Jada Pinkett Smith

More Telugu News