Sergei Lavrov: భారత్, రష్యా భాగస్వామ్యంపై ఎలాంటి సందేహం అవసరంలేదు: సెర్గీ లవ్రోవ్

Sergei Lavrov on India and Russia ties
  • భారత్ లో పర్యటిస్తున్న రష్యా విదేశాంగ మంత్రి
  • భారత విదేశాంగ మంత్రితో భేటీ
  • మీడియాతో మాట్లాడిన సెర్గీ లవ్రోవ్
  • అమెరికా ఒత్తిడి ఏమాత్రం పనిచేయదని స్పష్టీకరణ

ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ సమావేశం ముగిసింది. అనంతరం సెర్గీ లవ్రోవ్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యపై భారత్ అవలంబిస్తున్న తటస్థ వైఖరిని ప్రశంసించారు. రష్యా దళాలు ఉక్రెయిన్ లో ప్రవేశించడంపై భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకపోవడాన్ని తాము గుర్తించామని చెప్పారు. దీన్ని రష్యా అధినాయకత్వం అభినందిస్తోందని తెలిపారు. 

ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి అర్థవంతమైన చర్యలను పాశ్చాత్య దేశాలు అణచివేస్తున్నాయని లవ్రోవ్ ఆరోపించారు. అయితే భారత్-రష్యా భాగస్వామ్యంపై అమెరికా ఒత్తిడి ఎంతమాత్రం పనిచేయదని, ఈ విషయంలో సందేహాలే అవసరంలేదని నొక్కి చెప్పారు. తన విధానాలను అనుసరించేలా అమెరికా ఇతర దేశాలపై ఒత్తిడి చేస్తోందని మండిపడ్డారు. 

భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ, విభేదాలను ఎల్లప్పుడు చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే భారత్ అభిమతం అని ఉద్ఘాటించారు. ఉమ్మడి అజెండాను మరింత విస్తరించడం ద్వారా అనేక అంశాల్లో భారత్-రష్యా భాగస్వామ్యం మరింత వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News