Bombay High Court: ఉద్యోగం లేని మాజీ భర్తకు భార్య భరణం ఇవ్వాల్సిందే: బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Bombay High Court Orders Woman To Pay Alimony To Her Ex Husband
  • ప్రతినెల రూ. 3 వేలు భరణంగా చెల్లించాలని కింది కోర్టు ఆదేశం
  • హైకోర్టులో సవాలు చేసిన భార్య
  • సివిల్ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు  
  • భరణం చెల్లించాల్సిందేనంటూ విస్పష్ట తీర్పు
భార్యాభర్తలు విడిపోయినప్పుడు భర్త నుంచి భార్య భరణం కోరడం పరిపాటి. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం భార్య నుంచి భరణం కోసం కోర్టుకెక్కి విజయం సాధించాడు. మహారాష్ట్రలో జరిగిన కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే..  ఓ మహిళకు 1992లో వివాహమైంది. పెళ్లయిన తర్వాత చదువు కొనసాగించిన ఆమె ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వ ఉద్యోగం పొందింది. అయితే, భర్త తనను వేధిస్తున్నాడని, అతడి నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ 2015లో ఆమె నాందేడ్ సివిల్ కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. 

ఇక్కడే కథ మలుపు తిరిగింది. తనకు జీవనాధారం ఏమీ లేదని, పెళ్లయిన తర్వాత ఆమె చదువు కొనసాగించి ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించి మంచి వేతనం అందుకుంటోందని, కాబట్టి ఆమె నుంచి తనకు భరణం ఇప్పించాలంటూ భర్త కోర్టుకెక్కాడు. విచారించిన అదే కోర్టు భర్తకు ప్రతినెల 3 వేల రూపాయలు భరణంగా చెల్లించాలని 2017లో ఆమెను ఆదేశించింది. 

అయితే, కోర్టు ఆదేశాలను ఆమె ధిక్కరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఆమె ఇన్నాళ్లూ చెల్లించాల్సిన భరణం బకాయిల మేరకు ఆమె వేతనం నుంచి ప్రతినెల రూ.5 వేలు పక్కనపెట్టి ఆ సొమ్మును తమకు పంపాలంటూ 2019లో ఆమె పనిచేస్తున్న స్కూలు ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించింది. దీంతో ఆమె నాందేడ్ సివిల్ కోర్టు ఇచ్చిన రెండు తీర్పులను సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అయితే, అక్కడా ఆమెకు ఎదురుదెబ్బే తగిలింది. నాందేడ్ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు ధర్మాసనం.. జీవనాధారం లేని భర్తకు భార్య భరణం చెల్లించాల్సిందేనని స్పష్టమైన తీర్పు చెప్పింది.
Bombay High Court
Husband
Alimony
Maharashtra

More Telugu News