AAP: దేశం కోసం ప్రాణాలిస్తా!.. 'ఆప్' చీఫ్‌ కేజ్రీవాల్

  • త‌న ఇంటిపై బీజేవైఎం దాడిపై మౌనం వీడిన కేజ్రీ
  • తాను ముఖ్యం కాద‌ని, దేశ‌మే ముఖ్య‌మ‌ని హిత‌వు
  • బీజేపీ లాంటి పెద్ద పార్టీలు గూండాయిజం చేయ‌రాద‌ని చుర‌క‌
  • క‌లిసి క‌ట్టుగా దేశాన్ని ముందుకు తీసుకెళ‌దామ‌ని పిలుపు
aap chief arvind kijriwal fires on bjym attack on his house

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. దేశం కోసం ప్రాణాలిస్తానంటూ అయ‌న చేసిన వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఢిల్లీలోని త‌న ఇంటిపై బుధ‌వారం నాడు బీజేవైఎం శ్రేణుల దాడి నేప‌థ్యంలోనే కేజ్రీవాల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. కేజ్రీ ఇంటిపై జ‌రిగిన దాడిపై ఘాటుగా స్పందించిన ఆప్.. కేజ్రీని హ‌త్య చేసేందుకు బీజేవైఎం య‌త్నించింద‌ని ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. అయితే బుధ‌వారం ఈ దాడిపై మాట‌మాత్రంగా కూడా స్పందించని కేజ్రీ.. గురువారం ఢిల్లీలో ఈ-ఆటోల‌ను ప్రారంభించిన సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

'కేజ్రీవాల్ ముఖ్యం కాదు. ఈ దేశ‌మే ముఖ్యం. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తా' అంటూ కేజ్రీవాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అదే స‌మ‌యంలో బీజేపీ నేత‌ల‌కు ఆయ‌న చుర‌క‌లు అంటించారు. దేశంలోనే అతిపెద్ద పార్టీగా కొన‌సాగుతున్న బీజేపీ ఇలా గుండాయిజం చేస్తూ దాడుల‌కు పాల్ప‌డ‌కూడ‌ద‌ని చెప్పిన కేజ్రీ.. బీజేపీ అనుస‌రించే ఈ చ‌ర్య‌లు దేశ యువ‌త‌కు త‌ప్పుడు సంకేతాలు ఇచ్చిన‌ట్టే అవుతుంద‌ని హిత‌వు ప‌లికారు. క‌లిసి క‌ట్టుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పిన ఆయ‌న‌.. 75 ఏళ్లుగా క‌ల‌హాల‌తోనే దేశాన్ని ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉంచేశామ‌ని దెప్పి పొడిచారు.

More Telugu News