Will Smith: విల్ స్మిత్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆస్కార్ కమిటీ నిర్ణయం

  • ఇటీవల ఆస్కార్ అవార్డుల కార్యక్రమం
  • వేదికపై యాంకర్ క్రిస్ రాక్ ను కొట్టిన విల్ స్మిత్
  • ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విల్ స్మిత్
  • స్మిత్ తీరుపై సర్వత్రా విమర్శలు
  • సమావేశమైన అకాడమీ గవర్నర్ల బోర్డు
Will Smith will be penalized after he slapped Chris Rock

ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ నటుడు విల్ స్మిత్ యాంకర్ పై చేయి చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఆస్కార్ వేడుకకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్రిస్ రాక్... విల్ స్మిత్ భార్య జడా పింకెట్ పై ఓ జోకు పేల్చడమే ఈ ఘటనకు కారణం. అయితే, యావత్ ప్రపంచం దృష్టిలో ఈ ఘటన ఆస్కార్ కు చెడ్డపేరు తెచ్చేలా ఉందని సర్వత్ర అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో, అకాడమీ గవర్నర్ల బోర్డు ఈ అంశంపై లోతుగా చర్చించింది. విల్ స్మిత్ అనుచిత ప్రవర్తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనిపై అకాడమీ ఓ ప్రకటన విడుదల చేసింది. విల్ స్మిత్ ఓ వ్యక్తిపై భౌతిక దాడికి పాల్పడ్డాడని, బెదిరింపు ధోరణి కనబర్చాడని పేర్కొంది. వచ్చే నెల 18న జరిగే సమావేశంలో విల్ స్మిత్ పై తీసుకోబోయే చర్యలను ప్రకటిస్తామని వెల్లడించింది.

అంతేకాదు, జరిగిన ఘటనపై రెండు వారాల్లోగా లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలంటూ విల్ స్మిత్ కు అకాడమీ నోటీసులు పంపించింది. కాగా, అకాడమీ గవర్నర్ల బోర్డు తీరు చూస్తుంటే, స్మిత్ నుంచి ఉత్తమ నటుడి అవార్డును వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News