ice: చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?

  • శారీరక వ్యాయామాల సమయంలో తీసుకుంటే ఫలితాలు
  • ఇతరత్రా చల్లటి నీటితో ఉపయోగాల్లేవు
  • జీర్ణక్రియ నెమ్మదిస్తుంది
  • మ్యూకోస్, గొంతు సమస్యలకు దారితీయవచ్చు
  • గోరువెచ్చని నీటితో ఎన్నో ప్రయోజనాలు
Is drinking ice water bad for overall health

చల్లటి నీటితో గొంతు తడుపుకోవడం కొద్ది మందికి దినచర్యలో భాగమే. కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ చల్లటి నీటిని తాగే వారు ఉన్నారు. అలాగే, కేవలం వేసవిలోనే చల్లటి నీటిని తీసుకునే వారు కూడా ఉన్నారు. నిజానికి చల్లటి నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సందేహం కొద్ది మందికైనా వస్తుంది.

సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. మరి చల్లటి నీటిని తీసుకున్నప్పుడు ఆ నీటిని శరీర ఉష్ణోగ్రతతో సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఇందుకు వీలుగా అధిక శక్తిని శరీరం తీసుకుంటుందని డాక్టర్ సోనమ్ సోలంకి తెలిపారు. అంటే చల్లటి నీటిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత అస్థిరతకు గురవుతుంది. ఇది జీర్ణక్రియపైనా ప్రభావం చూపిస్తుంది.

ఆహారం సమయంలో చల్లటి నీటిని తాగడం వల్ల మన శరీరం ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించేందుకు అధిక శక్తిని తీసుకుంటుంది. ఇదే శక్తి తీసుకున్న ఆహారం జీర్ణమయ్యి, పోషకాల సంగ్రహణకు కావాల్సి ఉంటుంది. అందుకుని ఆహారం తీసుకునే సమయంలో చల్లటి నీటికి దూరంగా ఉండాలి. చల్లటి నీటిని తాగడం వల్ల మ్యూకోసా ఏర్పడి, గొంతు నొప్పి, ముక్కు కారే సమస్యలు కూడా ఎదురవుతాయని డాక్టర్ సోలంకి తెలిపారు.

మైగ్రేయిన్ నొప్పి ఉన్న వారు చల్లటి నీటిని తీసుకుంటే అది ఇంకా పెరుగుతుందని 2001లో నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తించారు. చైనా సంస్కృతిని గమనించినా ఆహారంతో పాటు గోరువెచ్చని నీరు, వేడి టీ సరఫరా చేస్తుంటారు. 

చల్లటి నీటిని తీసుకోవడం వల్ల, అధిక కేలరీలు ఖర్చవుతాయి కదా.. అది బరువు తగ్గేందుకు సాయపడుతుందా? అంటే అవునని చెప్పేందుకు శాస్త్రీయ అధారాలు ఏవీ లేవు.

శారీరక వ్యాయామం చేసే సమయంలో చల్లటి నీటిని తీసుకోవడం వల్ల ఆ సమయంలో శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగిపోకుండా ఉంటుందని 2012 నాటి అధ్యయనం ఒకటి తెలిపింది. దీనివల్ల వ్యాయామాలు సౌకర్యంగా చేసుకోవచ్చని పేర్కొంది. 

గోరు వెచ్చని నీటిని ఆహారానికి ముందు తీసుకోవడం వల్ల బరువు తగ్గేందుకు సాయపడుతుందని పరిశోధకులు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అంతేకాదు రక్త ప్రసరణకు, జీర్ణక్రియలకు, టాక్సిన్లు బయటకు వెళ్లేందుకు గోరు వెచ్చని నీరు సాయపడుతుంది.

More Telugu News