Sajjala Ramakrishna Reddy: టీడీపీది 40 ఏళ్ల సంబరాలు కాదు... 27 ఏళ్ల సంబరాలు!: సజ్జల విమర్శనాస్త్రాలు

  • 40వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న టీడీపీ
  •  1995లో ఎన్టీఆర్ ను చంద్రబాబు గద్దె దింపారన్న సజ్జల 
  • రామోజీ మద్దతుతో కుట్రకు పాల్పడ్డారని ఆరోపణ
Sajjala comments on TDP formation day

తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీది 40 ఏళ్ల సంబరాలు కాదని, 27 ఏళ్ల సంబరాలు అని ఎద్దేవా చేశారు. అదెలాగో వివరించారు. 

"నాడు టీడీపీ పుట్టుకను ఓ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాస్వామ్య పరంగా ప్రాధాన్యత ఉన్న ఘట్టంగా చెప్పుకోవచ్చు. అయితే, ప్రజాభిమానంతో అత్యధిక సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టిన ఎన్టీఆర్ గారిని 1995లో చంద్రబాబు గద్దె దింపారు. చంద్రబాబు తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యేలను మభ్యపెట్టి ఈనాడు అధినేత రామోజీరావు మద్దతుతో కుట్ర చేశారు. టీడీపీ ప్రస్థానంపై ఎవరైనా పరిశోధించ దలచుకుంటే ఇక్కడ్నించే చూడాలి. ఎన్టీఆర్, టీడీపీ అనే కోణంలో చూసేవారు 1995-2022 మధ్య ఏం జరిగిందనేది కూడా చూడాలి. ప్రధానంగా టీడీపీ చరిత్ర అంటే ఈ 27 ఏళ్లలో జరిగిందే... ఇదే మా పార్టీ ఉద్దేశం" అని సజ్జల పేర్కొన్నారు.

More Telugu News