MVV Satyanarayana: విశాఖ‌లో వ్యాపారాన్ని వ‌దిలేసిన వైసీపీ ఎంపీ.. కారణమిదేన‌ట‌!

  • విశాఖ‌లో వ్యాపారం చేయ‌బోన‌ని ఎంవీవీ ప్ర‌క‌ట‌న‌
  • ఇంటెలిజెన్స్ ఎస్పీ స్థ‌లం క‌బ్జా ఆరోప‌ణ‌ల‌పై మ‌న‌స్తాపం
  • వ్యాపారాన్ని హైద‌రాబాద్‌కు త‌ర‌లిస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌
ycp mp mvv satyanarayana stopshis bussiness in vizag

వైసీపీ కీల‌క నేత‌, విశాఖ‌ప‌ట్నం ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న ఎదుగుద‌ల‌కు అండ‌గా నిలిచిన విశాఖ న‌గ‌రంలో ఇక‌పై వ్యాపార‌మే చేయ‌బోనని ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రియ‌ల్ ఎస్టేట్ రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎంవీవీ.. విశాఖ కేంద్రంగా కీల‌క ప్రాజెక్టులు చేప‌ట్టారు. ఆ ప్రాజెక్టుల‌తోనే ఆయ‌న ఎదిగారు. అయితే ఇప్పుడు త‌న‌పై రేగిన ఓ వివాదం నేప‌థ్యంలో ఏకంగా విశాఖ‌లో ఇక‌పై వ్యాపార‌మే చేయ‌బోన‌ని తేల్చిపారేశారు.

విశాఖ‌లో తాను కొన్న భూమి చుట్టూ ప్ర‌హ‌రి గోడ క‌ట్టేందుకు ఇంటెలిజెన్స్ ఎస్పీ మ‌ధు య‌త్నించ‌గా.. ఆయ‌న‌ను ఎంవీవీ అనుచ‌రులు అడ్డుకున్నార‌ట‌. అంతేకాదు, ఇంటెలిజెన్స్ ఎస్పీ స్థ‌లాన్ని ఎంపీ క‌బ్జా చేశార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వైర‌ల్‌గా మారిపోయాయి. 

ఈ ఆరోప‌ణ‌ల నేపథ్యంలో స్పందిస్తూ.. ఇక‌పై విశాఖ కేంద్రంగా తాను ఎలాంటి వ్యాపారం చేయ‌బోన‌ని ఎంవీవీ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే మొద‌లైన ప్రాజెక్టుల ప‌నులు మాత్రం జ‌రుగుతాయ‌ని, విశాఖ‌లో కొత్త ప్రాజెక్టులు ఏవీ చేప‌ట్ట‌బోన‌ని చెప్పిన ఎంవీవీ.. త‌న వ్యాపారాన్ని హైద‌రాబాద్‌కు మార్చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అయినా ఇంత చిన్న విష‌యానికే అంత సంచ‌ల‌న నిర్ణ‌యం ఎలా తీసుకున్నార‌న్న విష‌యంపైనా ఎంవీవీ క్లారిటీ ఇచ్చారు. త‌న‌ను రాజ‌కీయంగా ఇబ్బంది పెట్టేందుకే త‌న ప్ర‌త్య‌ర్థులు ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఎంవీవీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో త‌న వ‌ల్ల సీఎం జ‌గ‌న్‌కు చెడ్డ‌పేరు రాకూడదన్న కార‌ణంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని ఎంవీవీ తెలిపారు.

More Telugu News