Brother Anil Kumar: బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ నుంచి ఏఈఎల్‌సీని కాపాడాలని తీర్మానం

Resolution to protect AELC from Brother Anil kumar
  • తెనాలిలో ఏఈఎల్‌సీ స‌మావేశం
  • రెండు వ‌ర్గాలుగా విడిపోయి దూషించుకున్న స‌భ్యులు
  • బ్ర‌ద‌ర్ అనిల్ ప్ర‌మేయం పెరిగింద‌ని ఓ వ‌ర్గం ఆరోప‌ణ‌
  • కోశాధికారి నియామ‌కంపైనా భిన్నాభిప్రాయాలు
గుంటూరు జిల్లాలో ప్ర‌ముఖ క్రైస్త‌వ సంఘంగా కొనసాగుతున్న ఆంధ్రా ఎవాంజిలిక‌ల్ లూథ‌ర‌న్ చ‌ర్చి (ఏఈఎల్‌సీ)లో బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ ప్ర‌మేయం పెరిగిపోతోంద‌ని స‌ద‌రు సంఘం ప్ర‌తినిధులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు, సంస్థ‌ను బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ నుంచి కాపాడాల‌ని ఏకంగా ఓ తీర్మానాన్నే ఆమోదించారు.

ఈ మేర‌కు గుంటూరు జిల్లా తెనాలిలోని ఈ సంఘానికి చెందిన చ‌ర్చిలో సంఘం ప్ర‌తినిధులు సోమ‌వారం ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌కు అనుకూలంగా కొంద‌రు, వ్య‌తిరేకంగా మ‌రికొందరు గ‌ళం విప్పారు. ఫ‌లితంగా స‌మావేశంలో ర‌భ‌స చోటుచేసుకుంది. రెండు గ్రూపులుగా విడిపోయిన సంఘం ప్ర‌తినిధులు ప‌రస్ప‌రం దూషించుకున్నారు. 

ఏఈఎల్‌సీ స‌మావేశంలోకి బ‌య‌టి వ్య‌క్తులు ప్ర‌వేశించారని కొంద‌రు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ సందర్భంగా సంఘంపై బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ ప్ర‌మేయం పెరిగిపోయింద‌ని ఓ వ‌ర్గం ఆరోపించింది. కోశాధికారి అబ్ర‌హాం నియామ‌కంపైనా స‌మావేశంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. చివ‌ర‌కు బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ నుంచి ఏఈఎల్‌సీని కాపాడాల‌ని ఈ స‌మావేశం ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
Brother Anil Kumar
AELC
Christian Organisation
Tenali

More Telugu News