Congress: కాంగ్రెస్ వ్యూహకర్తగా రానున్న ప్రశాంత్ కిశోర్.. చర్చలు జరుపుతున్న రాహుల్, ప్రియాంక

  • పీకే వద్దంటూ పార్టీ నేతల అభ్యంతరాలు
  • ఆయన వల్ల పార్టీకి ఒరిగేదేమీ ఉండదంటున్న నేతలు
  • ఇప్పటికే పార్టీకి జాతీయ స్థాయి వ్యూహకర్తగా సునీల్ కనుగోలు
  • ఒకే పార్టీకి ఇద్దరు వ్యూహకర్తల వల్ల చేటు తప్పదంటున్న నేతలు
congress talks with prashant kishor for gujarat Elections

వరుస పరాజయాలతో కుంగిపోతున్న కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం కోసం తపిస్తున్న పార్టీ ఆ దిశగా దృష్టిసారించింది. ఈ ఏడాది చివర్లో  గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను బరిలోకి దించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. పీకేతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. గుజరాత్‌లో పాతుకుపోయిన బీజేపీని గద్దెదించేందుకు ప్రశాంత్ కిశోర్ పనికొస్తారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అయితే, పార్టీలో కొందరు పీకేపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఆయన వల్ల పార్టీకి ఒరిగేదేమీ ఉండదంటూ ఉదాహరణలు కూడా చెబుతున్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన గోవాలో తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రశాంత్ కిశోర్ పనిచేసినప్పటికీ అక్కడ ఒక్క సీటును కూడా మమత పార్టీ గెలుచుకోలేకపోయింది. అంతేకాదు, 2017 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పీకే పనిచేసినప్పటికీ దారుణంగా ఏడు సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. వీటిని ఉదాహరణగా పేర్కొంటూ ఆయన రాకపై పార్టీ సీనియర్లు కొందరు పెదవి విరుస్తున్నారు. 

మరోవైపు, గతంలో పీకేతో కలిసి పనిచేసిన సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి వ్యూహకర్త బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే రంగంలోకి దిగిన సునీల్ వచ్చే ఏడాది కర్ణాటకలో జరగనున్న ఎన్నికల వ్యూహరచనలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకే పార్టీకి ఇద్దరు వ్యూహకర్తలు ఉంటే అది పార్టీకి మేలు చేయకపోగా, కీడు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.

 కాబట్టి ఒకవేళ ప్రశాంత్ కిశోర్‌ను వ్యూహకర్తగా నియమించుకున్నా.. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌కే పరిమితం చేస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. కాగా, పీకేతో ఇప్పటి వరకు తొలి విడత చర్చలు మాత్రమే జరిగాయని, ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని అధిష్ఠానంతో సన్నిహిత సంబంధాలున్న నేతలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News