All India Strike: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేడు, రేపు దేశవ్యాప్త సమ్మె.. బ్యాంకింగ్ సేవలపైనా ప్రభావం

  • సమ్మెకు పిలుపునిచ్చిన కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం
  • పలు డిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మెకు పిలుపు
  • సమ్మెకు టీఆర్ఎస్ మద్దతు, టీఎంసీ నో
  • రాజకీయ ప్రేరేపితమన్న భారతీయ మజ్దూర్ సంఘ్ 
Two day all India strike from Monday may hit essential services

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు, రేపు రెండు రోజులపాటు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్టు కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం ప్రకటించింది. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 

కార్మిక చట్టాల్లో సవరణలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఉపాధిహామీ నిధుల్లో కోతలకు వ్యతిరేకంగా.. అలాగే, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను డిమాండ్ చేస్తూ ఈ సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపింది. సమ్మెకు దిగుతున్నట్టు బొగ్గు, ఉక్కు, చమురు, టెలికం, తపాలా, ఆదాయపన్ను, కాపర్, బ్యాంకులు, బీమా తదితర రంగాల కార్మికులు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినట్టు పేర్కొంది. వీరితోపాటు రోడ్డు రవాణా, విద్యుత్ రంగ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని తెలిపింది.

రైల్వే, రక్షణ రంగాల్లోని యూనియన్లు కూడా సమ్మెకు మద్దతుగా భారీ ప్రదర్శనలు నిర్వహిస్తాయని వివరించింది. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరంలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాలున్నాయి. మరోవైపు, ఈ సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య కూడా మద్దతు ఇస్తుండడంతో రెండు రోజులపాటు బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. 

ఈ సమ్మెకు టీఆర్ఎస్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించగా, పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బంద్‌కు మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించింది. మరోపక్క, ఇది రాజకీయ ప్రేరేపితమని, ఇందులో పాల్గొనడం లేదని ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ పేర్కొంది.

More Telugu News