Gold: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

  • రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం
  • ద్రవ్యోల్బణం భయంతో బంగారంపై పెట్టుబడులు పెడుతున్న మదుపర్లు
  • ముడిచమురు ధర తగ్గడంతో ఇటీవల కొంత తగ్గుముఖం పట్టిన ధర
  • తాజాగా మళ్లీ రూ. 53 వేలు దాటేసిన పుత్తడి ధర
Gold and silver rates hiked once again

ఇటీవల కొంత తగ్గినట్టు కనిపించిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో మదుపర్లు తమ పెట్టుబడులను బంగారంపైకి మళ్లిస్తున్నారు. ముడిచమురు బ్యారెల్ ధర 139 డాలర్లకు చేరుకున్నప్పుడు ద్రవ్యోల్బణం భయంతో అప్రమత్తమైన మదుపర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడిపై పెట్టుబడులు పెట్టేవారు. అయితే, ముడి చమురు ధర మళ్లీ 100 డాలర్ల దిగువకు పడిపోయినప్పుడు బంగారం, వెండిలో విక్రయాలు జరిపారు.

అయితే, శుక్రవారం బ్యారెల్ ముడిచమురు ధర 120 డాలర్లకు చేరడంతో ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నెల 8న అంతర్జాతీయంగా ఔన్సు బంగారం 2069 డాలర్లకు చేరడంతో అప్పుడు దేశంలో పది గ్రాముల బంగారం ధర రూ. 55 వేలు దాటి రూ. 55,100కు చేరుకుంది. అలాగే కిలో వెండి ధర రూ. 72,900కు పెరిగింది. అయితే, ఈ నెల 15న మరోమారు చమురు ధర తగ్గడంతో బంగారం ధర రూ. 53 వేలకు దిగొచ్చింది. అయితే, శుక్రవారం మరోమారు ఔన్స్ బంగారం ధర 1995 డాలర్లకు పెరిగింది. దీంతో దేశీయ విఫణిలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 53,680కి చేరింది. వెండి ధర కిలో రూ. 70,500కు పెరిగింది.

More Telugu News