Radha Nair: కేరళ పద్మనాభస్వామి ఆలయ అద్భుతాన్ని వివరించిన సీనియర్ నటి రాధ

  • పగలు, రాత్రి సమంగా ఉండే రోజు ఆలయంలో విశిష్ట దృశ్యం
  •  సూర్యాస్తమయం చూడాల్సిందేనన్న రాధ
  • గోపురంలోని ప్రతి అంతస్తు గుండా భానుడి పయనం
  • ఫొటో పంచుకున్న రాధ
Senior actress Radha shares incredible visuals

కేరళలోని పద్మనాభస్వామి ఆలయం దేశంలో ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ట్రావెన్ కోర్ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్రకారులు భావిస్తారు. ఇప్పటికీ ఈ ఆలయం ట్రావెన్ కోర్ రాజకుటుంబం ఆధ్వర్యంలోని ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో నడుస్తోంది. 

కొన్నాళ్ల కిందట ఈ ఆలయంలో అపూర్వమైన రీతిలో భారీఎత్తున సంపద బయల్పడింది. బంగారం, వెండి, వజ్రవైఢూర్యాలతో కూడిన ఈ సంపద విలువ ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇంకా ఓ గది తలుపులు తెరవాల్సి ఉండగా, అందులో ఎంత సంపద ఉందోనని చర్చించుకుంటున్నారు. 

కాగా, సీనియర్ నటి రాధ పద్మనాభస్వామి ఆలయంలో తాను గమనించిన ఓ అద్భుతాన్ని అందరితో పంచుకున్నారు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం మానవ ఇంజినీరింగ్ మేధకు సిసలైన నిదర్శనం అని పేర్కొన్నారు. 

"మన పూర్వీకులు అద్భుతమైన దార్శనికులు. రాత్రి, పగలు సమంగా ఉండే రోజున ఇక్కడి సూర్యాస్తమయం వేళ అమోఘమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడి గోపురంలోని ప్రతి అంతస్తును పలకరించుకుంటూ సూర్యుడు అస్తమించడం నిజంగా అద్వితీయం" అని వివరించారు. కచ్చితంగా గోపురంలోని ప్రతి అంతస్తులో ఉన్న ద్వారాల్లో సూర్యుడు కనిపిస్తూ కిందికి దిగిపోవడాన్ని ఆమె ఫొటోల రూపంలో పంచుకున్నారు.

రాధ... తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు అగ్రశ్రేణి హీరోయిన్ గా కొనసాగారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఆమె నటించిన చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. ఎంతో మంచి డ్యాన్సర్ గా పేరుగాంచిన రాధ 90వ దశకం ఆరంభంలో చిత్రసీమకు గుడ్ బై చెప్పింది. ఆపై రాజశేఖర్ నాయర్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడి ముంబయిలో సెటిలైంది. రాధకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు కార్తీక, తులసి పలు దక్షిణాది చిత్రాల్లో నటించారు.
.

More Telugu News