Roja: తిరుపతిలో వెంకన్న, విశాఖలో అప్పన్న, బెజవాడలో దుర్గమ్మ ఫేమస్... సుపరిపాలనలో జగన్ ఫేమస్: రోజా

YCP MLA Roja heaps praise on CM Jagan
  • కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
  • సీఎం జగన్ పై రోజా ప్రశంసల వర్షం
  • జగన్ సుపరిపాలన సూపర్ అంటూ కితాబు

ద్రవ్య వినిమయ బిల్లుపై నేడు ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, జగన్ మూడేళ్ల పాలన చూస్తే రాజన్న రాజ్యం వచ్చిందని ప్రతి గుండె గర్వపడుతోందని అన్నారు. జగన్ సుపరిపాలన సూపర్ అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. మనమేంటో మనం ఎప్పుడూ చెప్పుకోకూడదని, మనం చేస్తున్న పనే చెప్పాలని జగన్ ఎప్పుడూ అంటుంటారని, ఈ మూడేళ్ల పాలన చూశాక జగన్ ఏంటనేది ఇంకా చెప్పాలా? అని అన్నారు. 

దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉందని, కేంద్రం ప్రకటించే గుడ్ గవర్నెన్స్ ర్యాంకుల్లో ఏపీకే ఫస్ట్ ప్లేస్ అని రోజా పేర్కొన్నారు. వైద్యరంగంలోనూ ఏపీ అత్యధిక సంఖ్యలో డాక్టర్లు, నర్సులతో రెండో స్థానంలో ఉందని, మెరుగైన గృహ సదుపాయాలు కలిగిన రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని అన్నారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొనే అంశంలో ఏపీ మూడోస్థానంలో నిలిచిందని తెలిపారు. ఏపీ పేదరిక నిర్మూలనలో ఐదో స్థానం, ఆరోగ్య రక్షణలో ఐదోస్థానంలో ఉందని వివరించారు. 

తిరుపతిలో వెంకన్న ఫేమస్, బెజవాడలో కనకదుర్గమ్మ ఫేమస్, విశాఖలో సింహాద్రి అప్పన్న ఫేమస్... సుపరిపాలనలో జగన్ ఫేమస్ అని ఆనందంగా చెబుతున్నానని రోజా వెల్లడించారు. గన్ పట్టుకున్న వందిమంది పనికిరాని వాళ్లకంటే గన్ లాంటి ఒక్కరు చాలని, ఆ గన్ లాంటి వ్యక్తే జగన్ అని కొనియాడారు. 

వేస్ట్ గాళ్ల పాలన మాకొద్దంటూ ప్రజలు వారిని తరిమికొట్టి జగనన్నకు 151 సీట్లతో అపూర్వ విజయం అందించారని, వారందరి నమ్మకం నిజమేనని నిరూపిస్తూ దేశంలోనే బెస్ట్ సీఎంగా జగన్ నిలిచారని కీర్తించారు.

  • Loading...

More Telugu News