NSA Doval: జై శంకర్, దోవల్ తో చైనా విదేశాంగ మంత్రి చర్చలు

  • సుదీర్ఘ విరామం తర్వాత ఉన్నత స్థాయి భేటీ
  • 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న సంబంధాలు
  • పునరుద్ధరణకు డ్రాగన్ యత్నాలు
 CHina foreign minister Wang meets Jaishankar NSA Doval in Delhi

భారత్ - చైనా దేశాల మధ్య సుదీర్ఘ విరామం అనంతరం ఓ ఉన్నతస్థాయి భేటీ సాధ్యపడింది. భారత పర్యటనకు గురువారం విచ్చేసిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో  భేటీ అయ్యారు. అంతకుముందు సౌత్ బ్లాక్ లోని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నివాసానికి వెళ్లి కూడా చర్చలు జరిపారు.


2020 గల్వాన్ లోయ ఘర్షణ అనంతరం ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం ఇంత వరకు జరగలేదు. నాటి ఘటనలో భారత్ 20 మంది జవానుల ప్రాణాలను నష్టపోగా.. చైనాకు రెట్టింపు నష్టం జరిగింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించనంత వరకు, సరిహద్దు ఒప్పందాలను గౌరవించి, కట్టుబడి ఉండనంత వరకు పూర్వం మాదిరి సంబంధాలు సాధ్యపడవని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ సమయంలో వాంగ్ యీ భారత్ కు రావడం పట్ల ప్రాధాన్యం నెలకొంది. 

భారత్ తో సంబంధాల పునరుద్ధరణకు మార్గం కల్పించడంతోపాటు.. ఈ ఏడాది చివర్లో బీజింగ్ లో జరిగే బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోదీని ఆహ్వానించడం వాంగ్ యీ పర్యటన లక్ష్యాలుగా తెలుస్తోంది. భారత్ కు రావడానికి ముందు వాంగ్ యీ ఇస్లామాబాద్ లో ఇస్లామిక్ కోపరేషన్ సదస్సుకు హాజరయ్యారు. 

ఆ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి, ఇస్లామిక్ స్నేహితుల అభిప్రాయాలకు మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించి వివాదం రాజేశారు. కశ్మీర్ పై వాంగ్ యీ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా సహ మరే ఇతర దేశానికి భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదని తేల్చి చెప్పింది.

More Telugu News