RIL: రిలయన్స్ పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు.. కళ్ల ముందుకు 2008 నాటి పరిస్థితులు !

  • భారీగా పెరిగిన ముడి చమురు ధరలు
  • ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు పెంచింది కొంతే
  • అంతర్జాతీయ ధరలతో పోలిస్తే ఇంకా తక్కువే
  • డోలాయమానంలో రిలయన్స్ సంస్థ
  • భారీగా పెంచి విక్రయించలేని సంకట స్థితి
RIL fuel retailers fear replay of 2008 as outlets run dry

ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరగడం వల్ల.. దేశీ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ పెట్రోల్ బంకులకు కూడా కష్టాలు వచ్చి పడ్డాయి. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో 2008 నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. 

రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ అయిన బీపీ భాగస్వామ్యంతో పెట్రోల్ బంకులను నిర్వహిస్తోంది. ఇటీవలి కాలంలో వీటిల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిగా అందుబాటులో ఉండడం లేదు. స్టాక్ అయిపోయిన వెంటనే రిలయన్స్ వేగంగా సరఫరా చేయడం లేదు. దీంతో డీలర్లు నో స్టాక్ బోర్డులతో రోజులు నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర గత నవంబర్ 4న 82 డాలర్లు ఉంటే, తాజాగా అది 120 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రోజువారీగా ధరలను ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలైన హెచ్ పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ సవరిస్తుండేవి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో గతేడాది నవంబర్ 4 తర్వాత నుంచి ఐదు రోజుల క్రితం వరకు అవి పెంచకుండా అవే ధరలను కొనసాగించాయి. అవి ప్రభుత్వరంగ సంస్థలు కనుక నష్టాలను భరించగలవు.

కానీ రిలయన్స్ పరిస్థితి వేరు. అంత నష్టానికి విక్రయాలు చేయలేదు. చేసినా ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాదు. దీంతో విక్రయాలు తగ్గించుకోవడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. 2008లోనూ రిలయన్స్ ఇదే పరిస్థితిని చవిచూసింది. నాడు ముడి చమురు ధర బ్యారెల్ 150 డాలర్ల వరకు దూసుకుపోయింది. అప్పుడు కూడా ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు సబ్సిడీ రేటుకే విక్రయాలు చేశాయి. ఆ పని తాను చేయలేక రిలయన్స్ సంస్థ దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్ స్టేషన్లను మూసేసింది. తిరిగి రెండేళ్ల క్రితమే వీటిని బీపీతో కలసి ఆరంభించింది. 

ఇప్పుడు ఉక్రెయిన్ - రష్యా యుద్ధం రూపంలో మరో సంక్షోభం వచ్చి పడింది. దీనిపై రిలయన్స్ బీపీ మొబిలిటీ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘దేశవ్యాప్తంగా 1,458 రిటైల్ అవుట్ లెట్స్ ను నిర్వహిస్తున్నాం. లీటర్ కు రూ.80 పైసల చొప్పున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచినా ఇంకా.. డీజిల్ లీటర్ పై ఇండస్ట్రియల్ ధరకు, రిటైల్ ధరకు మధ్య వ్యత్యాసం రూ.24 ఉంది. ఎన్నో సవాళ్లు ఉన్నా, రిటైల్ కస్టమర్ల డిమాండ్ తీర్చేందుకు రిలయన్స్ కట్టుబడి ఉంది’’ అని స్పష్టం చేశారు.

More Telugu News