NATO: రష్యా రసాయనిక దాడులు... నిరోధక వ్యవస్థలను యాక్టివేట్ చేసిన నాటో

  • రష్యా రసాయనిక దాడులు చేస్తోందన్న జెలెన్ స్కీ
  • నాటో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
  • అత్యవసరంగా సమావేశం కావాలని నాటో నిర్ణయం
  • కీలక వ్యాఖ్యలు చేసిన నాటో సెక్రటరీ జనరల్
NATO warns Russia in the wake of chemical weapons usage

ఉక్రెయిన్ సంక్షోభంలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. రష్యా రసాయనిక దాడులు చేస్తోందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఆరోపణల నేపథ్యంలో నాటో కూటమి స్పందించింది. రసాయనిక దాడులు చేపట్టవద్దంటూ రష్యాను హెచ్చరించింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెడితే పరిస్థితి తీవ్రరూపం దాల్చుతుందని స్పష్టం చేసింది. 

నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ తాజా పరిణామాలపై మాట్లాడుతూ, రష్యా రసాయనిక దాడుల నేపథ్యంలో నాటో కూటమి రసాయనిక, జీవాయుధ, అణ్వస్త్ర నిరోధక వ్యవస్థలను యాక్టివేట్ చేసిందని వెల్లడించారు. 

"నాటో దేశాలు రసాయనిక దాడులకు పాల్పడతాయన్న సాకుతో ఉక్రెయిన్ లో రష్యా రసాయనిక దాడులు చేసే అవకాశం ఉంది. దీన్ని నాటో తీవ్రంగా పరిగణిస్తోంది. ఒకవేళ ఉక్రెయిన్ లో రసాయనిక దాడులే జరిగితే, ఈ వివాదం రూపురేఖలే మారిపోతాయి. ఈ ప్రభావం ఉక్రెయిన్ పైనే కాదు, నాటో దేశాలపైనా పడుతుంది" అంటూ స్టోల్టెన్ బర్గ్ స్పష్టం చేశారు. రసాయనిక దాడులను ఎదుర్కొనేందుకు వీలుగా ఉక్రెయిన్ కు తగిన ఆయుధ సంపత్తిని అందించాలని నాటో సభ్య దేశాలు అంగీకరించాయని తెలిపారు. 

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పదేపదే విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో, నాటో కూటమి ఇవాళ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్ కు అదనపు సాయం, సైబర్ భద్రత కల్పించడం వంటి అంశాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, రష్యా రసాయనిక ఆయుధాలు వాడినట్టు నిర్ధారణ అయితే ఉక్రెయిన్ సంక్షోభంలోకి నాటో కూటమి ప్రత్యక్షంగా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాటో అత్యవసర సమావేశానికి ముందు స్టోల్టెన్ బర్గ్ చేసిన తాజా వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

More Telugu News