North Korea: నిషేధిత ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా... మరోసారి సవాల్ విసిరిన కిమ్!

  • ఆయుధ పరీక్షలు ముమ్మరం చేసిన ఉత్తర కొరియా
  • నేడు లాంగ్ రేంజి క్షిపణి ప్రయోగం
  • జపాన్ సముద్ర జలాల వరకు వచ్చిన క్షిపణి
  • అమెరికా లక్ష్యంగా అస్త్రాలకు పదునుపెడుతున్న కిమ్
North Korea test fires banned ICBM

యావత్ ప్రపంచం కరోనాతో తల్లకిందులవుతున్న తరుణంలోనూ ఉత్తర కొరియా వరుసగా ఆయుధ పరీక్షలు చేపడుతోంది. కిమ్ జాంగ్ ఉన్ నాయకత్వంలోని ఉత్తర కొరియా గత కొన్నివారాలుగా తన అస్త్రాలకు మరింత పదును పెడుతోంది. తాజాగా ఉత్తర కొరియా అత్యంత శక్తిమంతమైన క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే వెల్లడించారు. అటు, జపాన్ కూడా ఈ క్షిపణి పరీక్షను నిర్ధారించింది. 

నేడు ఉత్తర కొరియాలోని ఓ గుర్తు తెలియని ప్రదేశం నుంచి దూసుకెళ్లిన ఈ ఖండాతర క్షిపణి దాదాపు 1,100 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్ర జలాల్లో పడిపోయింది. ఇది గంటకు పైగా గగనతలంలో ప్రయాణించిందని జపాన్ అధికారులు తెలిపారు. ఉత్తర కొరియా నిషేధిత ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం 2017 తర్వాత ఇదే ప్రథమం. ఈ నెల 16న ఉత్తర కొరియా ఒక భారీ క్షిపణిని ప్రయోగించగా, అది రాజధాని ప్యాంగ్ యాంగ్ గగనతలంలోనే పేలిపోయి తునాతునకలైంది. 

తాజాగా ఉత్తర కొరియా ప్రయోగించిందని ఖండాంతర క్షిపణి అని, తద్వారా కిమ్ జాంగ్ ఉన్ అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన మాటను తప్పాడని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే విమర్శించారు. లాంగ్ రేంజి మిస్సైళ్లను పరీక్షంచబోమని, అణు పరీక్షలు జరపబోమని 2018లో కిమ్ జాంగ్ ఉన్ మారటోరియం విధించుకున్నారు. అయితే అది 2020లో పటాపంచలైంది. మారటోరియంను తాము ఎక్కువకాలం అమలు చేయలేమని స్పష్టం చేసిన ఉత్తరకొరియా అధినేత మళ్లీ అమెరికాకు, ప్రపంచదేశాలకు సవాళ్లు విసరడం ప్రారంభించారు. 

ఇటీవల కాలంలో ఉత్తర కొరియా హాసంగ్-14 లాంగ్ రేంజి క్షిపణులను రూపొందించింది. ఇవి 8,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలవు. ఇలాంటి భూతల క్షిపణులు కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. అయితే, హాసంగ్-14 గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. కానీ, 2017లోనే ఉత్తర కొరియా 13,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల ఓ రాక్షస మిస్సైల్ ను ప్రయోగించిందని, నిర్దిష్ట మార్గంలో పయనిస్తూ అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా తాకగలిగే సత్తా దానికుందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News