Karnataka: రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు హత్యకేసులో కీలక మలుపు.. భర్త హత్యకు భార్య రూ. 10 లక్షల సుపారి

  • హత్యకు గురైన రాజుకు ముగ్గురు భార్యలు
  • రెండో భార్యతో డబ్బుల విషయంలో వివాదం
  • భర్త భాగస్వాములతో కలిసి హత్యకు కుట్ర
  • దర్యాప్తులో వెలుగు చూసిన అసలు నిజం
Karnataka woman pays Rs10 lakh to get husband murdered

కర్ణాటకలోని బెళగావిలో సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు దొడ్డబొమ్మన్నవర్ హత్యకేసులో కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన హత్యకు స్వయంగా భార్యే రూ. 10 లక్షల సుపారి ఇచ్చిన విషయం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో రాజు రెండో భార్య కిరణ, భాగస్వాములైన ధర్మేంద్ర, శశికాంత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే ఈ నెల 15న బైక్‌పై వచ్చిన దుండగులు రాజును అడ్డగించి కంట్లో కారం చల్లి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. రోడ్డు పక్కన పడివున్న రాజు మృతదేహాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనకు ముగ్గురు భార్యలని, వారికి వేర్వేరుగా ఇళ్లు కట్టించి ఇచ్చాడని గుర్తించారు.  ఈ క్రమంలో డబ్బుల విషయంలో రెండో భార్య అయిన కిరణతో రాజుకు విభేదాలు చోటుచేసుకున్నాయి. 

దీంతో భర్తను అంతమొందించాలని నిర్ణయించుకున్న కిరణ.. వ్యాపారంలో భర్త భాగస్వాములైన వారితో చేతులు కలిపింది. అందరూ కలిసి రాజు హత్యకు ప్లాన్ చేశారు. ఇందుకోసం హంతకముఠాతో రూ. 10 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కిరణను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కిరణ, రాజు వ్యాపార భాగస్వాములైన ధర్మేంద్ర, శశికాంత్‌లను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News