Muslim Family: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయానికి ఖరీదైన భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం కుటుంబం

  • బీహార్ లో విరాట్ రామాయణ్ మందిర నిర్మాణం
  • 270 అడుగుల ఎత్తులో కట్టనున్న మహావీర్ మందిర్ ట్రస్ట్
  • రూ.2.5 కోట్ల విలువైన భూమిని ఇచ్చిన ఇష్తియాఖ్ అహ్మద్ ఖాన్ ఫ్యామిలీ
Muslim Family Donates Land For Largest Hindu Temple In the World

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయానికి తమ భూమిని విరాళంగా ఇచ్చి అసలైన మత సామరస్యాన్ని చాటుకుందో ముస్లిం కుటుంబం. బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాలోని కైత్వాలియాలో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం విరాట్ రామాయణ్ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఆ ఆలయ నిర్మాణం కోసం అదే జిల్లాలోని గువాహటీకి చెందిన ఇష్తియాఖ్ అహ్మద్ ఖాన్.. రూ.2.5 కోట్ల విలువ చేసే తమ భూమిని ఆ ఆలయ నిర్మాణ పనులను చూస్తున్న పాట్నాలోని మహావీర్ మందిర్ ట్రస్ట్ కు అందించారు. 

ఆలయ నిర్మాణం కోసం భూమిని విరాళంగా ఇచ్చేందుకు ఇప్పటికే అన్ని రకాల ప్రక్రియలను ఇష్తియాఖ్ పూర్తి చేశారని, కేశారియా సబ్ డివిజన్ సబ్ రిజిస్ట్రార్ వద్ద ఆలయం పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేయించారని అధికారులు చెబుతున్నారు. ఆ భూమి మొత్తం తమ కుటుంబం పేరు మీదే ఉందని, దీంతో మందిర నిర్మాణం కోసం తమ వంతుగా ఏదైనా చేయాలనిపించిందని చెప్పారు. ఈ క్రమంలోనే భూమిని విరాళంగా ఇచ్చేశామని, తమ కుటుంబం ఇంతకుముందు నుంచే ఇలాంటి సంప్రదాయాన్ని అనుసరిస్తోందని చెప్పారు. 

భూమిని ఆలయానికి విరాళంగా ఇచ్చి అసలైన మత సామరస్యాన్ని ఇష్తియాఖ్ చాటారని, రెండు వర్గాల మధ్య సోదరభావానికి అది చిహ్నమని మహావీర్ ట్రస్ట్ చైర్మన్ ఆచార్య కిషోర్ కుమార్ చెప్పారు. ముస్లింల సహకారం లేకుంటే ఇంత పెద్ద ఆలయం సాకారమయ్యేదే కాదని అన్నారు. 

కాగా, ఆలయం కోసం ఇప్పటిదాకా 125 ఎకరాల భూమిని మహావీర్ ట్రస్ట్ సేకరించింది. మరో 25 ఎకరాల కోసమూ ట్రస్ట్ ప్రయత్నాలు చేస్తోంది. 215 అడుగుల ఎత్తుతో నిర్మించిన ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైనదిగా కంబోడియాలోని ఆంగ్ కోర్ వాట్ కాంప్లెక్స్ ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు దానిని మించి 270 అడుగుల ఎత్తులో విరాట్ రామాయణ్ మందిర్ ను నిర్మించనున్నారు. రూ.500 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించతలపెట్టారు. 

కొత్త పార్లమెంట్ బిల్డింగ్ సెంట్రల్ విస్టాకు రూపునిచ్చిన నిపుణుల నుంచి సలహాలు తీసుకుని త్వరలోనే ఆలయ ఆకృతిని ఫైనల్ చేయనున్నారు.

More Telugu News