Steve Smith: ఆసీస్ బ్యాటర్ స్మిత్ అరుదైన రికార్డు.. సంగక్కర, సచిన్ రికార్డులు వెనక్కి!

  • 150 ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా స్మిత్
  • అతడి ఖాతాలో 7,993 పరుగులు
  • తర్వాతి స్థానాల్లో సంగక్కర, సచిన్, సెహ్వాగ్
Steve Smith Surpasses Kumar Sangakkara and Sachin Tendulkar

ఆస్ట్రేలియా టెస్టు జట్టు మాజీ సారథి స్టీవ్ స్మిత్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 150 ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ సారథి కుమార సంగక్కర, సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలుగొట్టాడు. మూడు టెస్టులు, నాలుగు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. 

ఇందులో భాగంగా జరిగిన తొలి రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. ప్రస్తుతం మూడో టెస్టు కొనసాగుతోంది. రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో 78 పరుగులు చేసిన స్మిత్, కరాచీలో జరిగిన రెండో టెస్టులో 72 పరుగులు సాధించాడు. ప్రస్తుతం లాహోర్‌లో జరుగుతున్న మూడో టెస్టులో 59 పరుగులు చేశాడు. స్మిత్‌కు ఇది 85వ టెస్టు కాగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ అతడికి 150వది.

ఈ ఇన్నింగ్స్‌లో 59 పరుగులు చేసిన స్మిత్ టెస్ట్ కెరియర్‌లో ఇప్పటి వరకు మొత్తం 7,993 పరుగులు సాధించాడు. ఫలితంగా సంగక్కర, టెండూల్కర్ రికార్డులు బద్దలయ్యాయి. సంగక్కర 150 ఇన్నింగ్స్‌లలో 7913 పరుగులు చేయగా ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది. 7,869 పరుగులతో సచిన్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 7694 పరుగులతో వీరేంద్ర సెహ్వాగ్, 7,680 పరుగులతో ద్రవిడ్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

More Telugu News