boy: అర్ధరాత్రి 10 కిలోమీటర్ల పరుగు.. నోయిడాలో 19 ఏళ్ల కుర్రాడి దినచర్య.. వీడియో వైరల్

  • పగలంతా మెక్ డొనాల్డ్స్ లో ఉద్యోగం
  • అర్ధరాత్రి పరుగెత్తుతూ ఇంటికి
  • ఆర్మీలో చేరడమే అతడి లక్ష్యం
  • వీడియోకు 40 లక్షలకు పైగా వ్యూస్
Boy runs home from work at midnight in Noida

19 ఏళ్లు.. సాధారణంగా కాలేజీ చదువుతో, ఖాళీ దొరికితే స్నేహితులతో కలసి షికార్లు కొట్టే వయసు. కానీ నోయిడాకు చెందిన 19 ఏళ్ల కుర్రాడు ప్రదీప్ మెహ్రా అలా కాదు. చిన్న వయసుకే బాధ్యతలు తెలిసినవాడు. ఉత్తరాఖండ్ లోని పల్మోరా కు చెందిన ఈ బాలుడు నోయిడాలోని సెక్టార్ 16లో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ లో పనిచేస్తుంటాడు. 

పొద్దున వెళితే.. అర్ధరాత్రి వరకు డ్యూటీ. దీంతో రాత్రి విధులు ముగిసిన తర్వాత 10 కిలోమీటర్ల దూరంలోని బరోలాలో ఉన్న తన ఇంటి వరకు పరిగెత్తుతూ వెళ్లడం అతడి దినచర్యలో భాగం. అతడితోపాటు అతడి సోదరుడు, అమ్మ కలసి ఉంటున్నారు. ప్రస్తుతం ప్రదీప్ అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఓ రోజు రాత్రి నిర్మాత వినోద్ కాప్రి దృష్టిలో ప్రదీప్ పడ్డాడు. ‘‘ఎందుకు రాత్రి వేళ అలా పరుగెత్తుతున్నావు, నా కారులో రా దిగబెడతాను’’ అంటూ ఆఫర్ చేశాడు. అయినా ఆ బాలుడు రావడానికి నిరాకరించాడు. అయినా వినోద్ కాప్రి అలా వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఆ బాలుడితో మాటలు కలిపాడు. ఉదయం రన్నింగ్ చేయొచ్చుగా? అని ప్రశ్నించాడు. దాంతో అప్పుడు డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుందని, సమయం చాలదని అతడు బదులిచ్చాడు. ఇలా ఒక్కసారి కాదు.. ఎన్నో పర్యాయాలు లిఫ్ట్ ఇస్తానన్నా, ఆ బాలుడు తీసుకోలేదు. 

ఆర్మీలో చేరడమే తన ధ్యేయమని ప్రదీప్ చెప్పడం గమనార్హం. అందుకోసమే నిత్యం సాధనలో భాగంగా రన్నింగ్ చేస్తున్నానని.. కారులో వస్తే తన సాధన గాడితప్పుతుందన్నాడు. ప్రతి రోజు పొద్దున 8 గంటలకు లేవాలి. పనికి వెళ్లడానికి ముందు ఆహారం సిద్ధం చేసుకోవాలి. రాత్రి వచ్చిన తర్వాత కూడా ఆహారాన్ని వండుకుని తినడమే కాదు.. రాత్రి షిప్ట్ ఉద్యోగానికి వెళ్లిన సోదరుడి కోసం కూడా ఆహారాన్ని ప్రదీప్ సిద్ధం చేయాలి. ఇది అతడి దినచర్య. ఈ వీడియోను ఇప్పటికే 40 లక్షల మంది చూశారు.

More Telugu News