All England Open 2022: లక్ష్యసేన్‌కు నిరాశ.. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓటమి

Viktor Axelsen Beats Lakshya Sen to Win Mens Singles Title
  • రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న లక్ష్యసేన్
  • విక్టర్ అక్సెల్సెన్ చేతిలో వరుస గేముల్లో ఓటమి
  • ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌ను రెండోసారి గెలుచుకున్న విక్టర్

ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లి రికార్డు సృష్టించిన భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌కు చివరిమెట్టుపై నిరాశ ఎదురైంది. డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ నంబర్ వన్, ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సెల్సెన్‌తో గత రాత్రి జరిగిన ఫైనల్‌లో 10-21, 15-21తో వరుస సెట్లలో ఓటమి పాలై రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. ఫలితంగా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ టైటిల్‌ను గెలుచుకున్న మూడో భారతీయుడిగా నిలవాలన్న అతడి ఆశలు అడియాసలయ్యాయి. 

టోర్నీ మొత్తం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన విక్టర్..ప్రత్యర్థి లక్ష్యసేన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బలమైన షాట్లతో విరుచుకుపడ్డాడు. తొలి గేమ్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన సేన్.. రెండో గేమ్‌లో కొంత పుంజుకున్నప్పటికీ విక్టర్ ముందు నిలవలేకపోయాడు. ఫలితంగా ఓటమి పాలయ్యాడు. 

విక్టర్ ఆల్ ఇంగ్లండ్ ట్రోఫీ గెలుచుకోవడం ఇది రెండోసారి. మహిళల సింగిల్ టైటిల్‌ను జపాన్‌కు చెందిన అకానె యమగుచి గెలుచుకుంది. మహిళల డబుల్స్‌లో సెమీస్‌కు చేరిన గాయత్రి గోపిచంద్ పుల్లెల-ట్రీసా జాలి జోడి.. చైనాకు చెందిన జింగ్ షియాన్-జాంగ్ యు చేతుల్లో ఓడింది.

  • Loading...

More Telugu News