Revanth Reddy: కేసీఆర్ ఫాంహౌస్ లో పండించిన ధాన్యాన్ని ఎలా కొంటారో, రైతులు పండించిన ధాన్యాన్ని ఎలా కొనరో చూస్తాం: రేవంత్ రెడ్డి

  • కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మన ఊరు-మన పోరు సభ
  • హాజరైన రేవంత్ రెడ్డి
  • కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు
  • ఫాంహౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరిక
Revanth Reddy asks CM KCR govt should buy paddy from farmers

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మన ఊరు-మన పోరు భారీ బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ కు ప్రజలు రెండుసార్లు అధికారం కట్టబెట్టినా ప్రయోజనం లేదని అన్నారు.  ఢిల్లీ వెళ్లి కేంద్రంపై పోరాడతానని, అగ్గి రాజేస్తానని కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలతో సరిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. 

ఏప్రిల్ మాసం నుంచే ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోతే రైతులతో కలిసి కేసీఆర్ ఫాంహౌస్ ను ముట్టడిస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ ఫాంహౌస్ లో పండించిన ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తారో, రైతులు పండించిన వరిధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తారో చూస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ.2.5 లక్షల కోట్లు. రూ.10 వేల కోట్లతో రైతుల నుంచి ధాన్యాన్ని కొనలేరా? అని ప్రశ్నించారు. తెలంగాణ సర్కారు రైతుల నుంచి చివరి ధాన్యపు గింజ కొనుగోలు చేసేంతవరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

More Telugu News